ఈ నెల 30న తిరుపతిలో టీటీడీ భారీ కార్యక్రమం
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం నాడు 81,516 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 25,547 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది.
కాగా.. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈ నెల 30వ తేదీన తిరుపతిలో ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. టీటీడీ అడ్మిన్ బిల్డింగ్ ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో కార్తీక మహాదీపోత్సవాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగేలా ఏర్పాట్లు చేపట్టింది. ఆ రోజున సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8.45 నిమిషాల వరకు భక్తిప్రపత్తులు వెల్లివిరిసేలా విశేష పూజలు, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు టీటీడీ అధికారులు.

మహాదీపోత్సవంలో భాగంగా దీప ప్రజ్వలన విశిష్టతను చాటుతూ ప్రత్యేక పూజలు, శ్రీనివాస అర్చన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ మహాలక్ష్మీ పూజ నిర్వహించనున్నారు. అనంతరం హరిహర కార్తీక నృత్య రూపకం, భక్తి గీతాలాపన, అష్టలక్ష్మీ వైభవం నృత్య ప్రదర్శనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తనున్నాయి. చివరగా టీటీడీ అర్చకుల చేతుల మీదుగా కుంభహారతి, నక్షత్రహారతి, మంగళహారతితో ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఈ మహాదీపోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా వందలాది మంది మహిళలు సామూహికంగా దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ నీరాజనం సమర్పించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దివ్య అనుగ్రహంతో సమస్త ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని లోకక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. కార్తీక దీపారాధన వైశిష్ట్యాన్ని చాటుతూ, భక్తుల్లో భక్తిభావాన్ని, దైవచింతనను పెంపొందించే లక్ష్యంతో టీటీడీ ఈ మహాదీపోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.













Click it and Unblock the Notifications
