అందుకే.. సిరాజ్ ను తుదిజట్టు నుంచి తప్పించాం: తేల్చి చెప్పిన గిల్
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో భారత్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్‌లో చివరి రోజు కివీస్ బ్యాటర్లు పట్టుదలతో నిలబడటంతో విజయం చేజారింది. ఈ డ్రాతో లభించిన నాలుగు పాయింట్లతో సంతృప్తి పడాల్సి వచ్చిందే తప్ప డబ్ల్యూటీసీ పాయింట్లు ఏ మాత్రం మెరుగుపడలేదు. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్లు మరింత తగ్గాయి.
ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తుది జట్టు నుంచి తప్పించడంపై భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ స్పష్టత ఇచ్చాడు. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న బౌలర్లకే ప్రాధాన్యం ఇచ్చామని, అందుకే సిరాజ్‌ను బెంచ్‌కే పరిమితం చేయాల్సి వచ్చిందని తెలిపాడు. సిరాజ్ తనకు మంచి స్నేహితుడని, అయినప్పటికీ జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొన్నాడు. బౌలర్ల ఎంపిక వ్యూహాత్మకంగానే జరిగిందని వ్యాఖ్యానించాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం గిల్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే సిరాజ్‌తో స్వయంగా మాట్లాడానని, తుది జట్టులో చోటు దక్కకపోవడానికి గల వ్యూహాత్మక కారణాలను అతనికి వివరించానని గిల్ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతి ఆటగాడి కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలు సహజమని, ప్రస్తుత పరిస్థితుల్లో జట్టు అవసరాలకు తగ్గట్లుగానే సిరాజ్ కు బదులుగా వేరే బౌలర్లను ఎంచుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
ఈ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనను సిరాజ్ అర్థం చేసుకున్నాడని, త్వరలోనే ఫామ్ లోకి వస్తాడనే నమ్మకం తనకు ఉందని గిల్ ధీమా వ్యక్తం చేశాడు. వెల్లింగ్టన్ టెస్ట్ కోసం భారత్ నలుగురు ఫాస్ట్ బౌలర్ల వ్యూహాన్ని ఎంచుకున్న విషయం తెలిసిందే. జస్ ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కాంబోజ్ కు తుదిజట్టులో చోటు దక్కింది. స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్ కు మాత్రమే తుదిజట్టులోకి తీసుకున్నారు.
సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇద్దరినీ ఒకేసారి తుది జట్టుకు దూరంగా పెట్టడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ జట్టులో ఉండివుంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. వీటి పట్ల గిల్ స్పందించాడు. బౌలర్ల రిథమ్, వారి ఫామ్ ఆధారంగానే ఈ అయిదుమంది బౌలర్ల ఎంపిక జరిగిందని గిల్ సమర్థించుకున్నాడు.
నిజానికి.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో సిరాజ్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ సైకిల్‌లో ఆడిన 11 టెస్టు మ్యాచ్‌ల్లో ఏకంగా 43 వికెట్లు పడగొట్టాడు. విదేశీ పిచ్ లపై జట్టు సాధించిన అనేక విజయాల్లో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. సిరాజ్, జడేజా వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు లేకపోవడం వల్లే భారత్ వికెట్లు తీయలేకపోయిందా అనే ప్రశ్నకు గిల్ అలాంటిదేమీ లేదని తోసిపుచ్చాడు. ప్రస్తుత ఫామ్ ఆధారంగానే తుదిజట్టు ఎంపిక జరిగిందని పునరుద్ఘాటించాడు.














Click it and Unblock the Notifications
