మేడ్ ఇన్ ఇండియా ముసుగులో పాక్ విషం.. హైదరాబాద్‌లోనూ కలకలం!
అందంగా కనిపించాలనే ఆశ.. తక్కువ ధరకే లభిస్తున్నాయనే అత్యాశ ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. ఇండియాలో పూర్తిగా నిషేధించబడిన పాకిస్థానీ బ్యూటీ క్రీమ్స్ దొడ్డిదారిన దేశంలోకి ప్రవేశించి విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి. తాజాగా కేరళలో ఓ 17 ఏళ్ల బాలిక ఈ క్రీమ్ వాడి కిడ్నీలు పాడయ్యాయని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన కేరళ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ బ్యూటీ ప్రొడక్ట్స్, ప్రొటీన్ పౌడర్లపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన చూసి కొన్న బాలికకు అస్వస్థత
కేరళలో స్కిన్ క్రీమ్ వాడకం వల్ల ఇద్దరు వ్యక్తులు తమ కిడ్నీలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు. ఇందులో 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు మేరకు సదరు కంపెనీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇన్ స్టాగ్రామ్‌లో వచ్చిన ఓ ప్రకటనను చూసిన ఆ బాలిక 'ఎఫ్ ట్యూన్' అనే పేరుతో విక్రయిస్తున్న క్రీంను ఆమె కొనుగోలు చేసి వాడింది. అయితే ఆ క్రీంలో పాదరసం మోతాదు అత్యధికంగా ఉండటంతో ఆమె కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆమె చికిత్స కోసం దాదాపు రూ. లక్ష వరకు ఖర్చయింది. మరోవైపు ప్రముఖ గాయకుడు సలీం కోడత్తూర్ కూడా పదేళ్ల క్రితం ఫెయిర్నెస్ క్రీమ్ వాడటం వల్ల తనకు 'మెంబ్రేనస్ నెఫ్రోపతీ' అనే కిడ్నీ వ్యాధి సోకిందని, నెలల తరబడి చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై కేరళ ఆరోగ్య శాఖ స్పందిస్తూ.. ఎలాంటి అనుమతులు లేని ఇటువంటి బ్యూటీ, హెల్త్ ప్రొడక్ట్స్ పాకిస్థాన్ నుంచి అలాగే మంగళూరు-కాసర్‌గోడ్ ప్రాంతాల నుంచి అక్రమంగా వస్తున్నాయని వెల్లడించింది.

కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం: CDCSO వార్నింగ్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థానీ వస్తువులపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో పాకిస్థానీ కాస్మెటిక్స్ పట్టుబడటం ఆందోళన కలిగిస్తోంది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDCSO) గత సెప్టెంబర్లోనే దీనిపై ఓ పబ్లిక్ నోటీసు జారీ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన 'గోరీ బ్యూటీ క్రీమ్', 'చాందినీ వైటెనింగ్ క్రీమ్'లలో హానికరమైన హెవీ మెటల్స్ అధికంగా ఉన్నాయని స్పష్టం చేసింది. సాధారణంగా వీటిలో పాదరసం స్థాయి ఒక పీపీఎం కంటే తక్కువగా ఉండాలి. కానీ కొన్ని ల్యాబ్ రిపోర్టులలో వీటిలో మెర్క్యురీ స్థాయి ఏకంగా 5,000 పీపీఎం వరకు ఉన్నట్లు తేలింది. వీటిని వాడటం వల్ల చర్మం, కిడ్నీలు, నాడీ వ్యవస్థకు కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్, ముంబై, ఇండోర్‌లలోనూ అక్రమ నిల్వలు
గత జులైలో మహారాష్ట్రలోని నాందేడ్ పోలీసులు ఓ దుకాణంపై దాడి చేసి.. పాకిస్థాన్‌లో తయారైన రూ.40 లక్షల విలువైన నిషేధిత కాస్మెటిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తాను ముంబై నుంచి ఈ సరుకుని తెప్పించినట్లు దుకాణదారుడు వెల్లడించాడు. అంతేకాకుండా హైదరాబాద్, ఇండోర్ నగరాల్లో కూడా పాకిస్థానీ బ్యూటీ ప్రొడక్ట్స్ పట్టుబడటం ఈ దందా విస్తృతికి అద్ధం పడుతోంది.
ఇండియాలోకి ఎలా వస్తున్నాయంటే?
నిషేధం ఉన్నప్పటికీ ఈ ప్రొడక్ట్స్ ఇండియాలోకి స్మగ్లింగ్ మార్గాల్లో వస్తున్నాయి. పాకిస్థాన్ నుంచి ఈ వస్తువులు ముందుగా యూఏఈకి చేరుకుంటాయి. అక్కడి నుంచి అక్రమ మార్గాల్లో ఇండియాలోకి తీసుకువస్తున్నారు. 'గోరీ బ్యూటీ క్రీమ్' రూ.170 నుంచి రూ.430 మధ్య.. 'చాందినీ వైటెనింగ్ క్రీమ్' సుమారు రూ.400 ధరకు లభిస్తుండటంతో తక్కువ ధర కారణంగా సామాన్యులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కొందరు విక్రేతలు తయారీదారు వివరాలు దాచిపెడుతూ.. వీటిని మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులుగా నమ్మించి విక్రయిస్తుండటం గమనార్హం.














Click it and Unblock the Notifications
