పాలకుడి ముఖం మారితే పాలన మారుతుందా? పంది ముఖం పోస్టర్ల వెనుక అసలు కథేంటి?
రాజకీయ వ్యవస్థలో ఎప్పటికప్పుడు కొత్త ముఖాలు తెరపైకి రావడం సాధారణమే. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ పార్టీల రంగులు మారుతాయి, నాయకత్వాలు మారతాయి, సరికొత్త హామీలు హోరెత్తుతాయి. కానీ దశాబ్ధాలు గడుస్తున్నా సామాన్య ప్రజల రోజువారీ సమస్యలకు మాత్రం శాశ్వత పరిష్కారం దొరుకుతోందా? అన్న ప్రశ్న ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చకు ఆజ్యం పోస్తూ గత రెండ్రోజులుగా దినపత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో ఓ వింత పోస్టర్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. పంది ముఖాన్ని పోలిన మాస్క్ తో ఉన్న ఆ పోస్టర్ల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మాజీ ఐఏఎస్ అధికారి రాజకీయ పార్టీ నెలకొల్పి తనదైన రీతిలో చక్రం వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా సోషల్ మీడియాలో 'సైలెంట్ పొలిటికల్ పార్టీ' అనే పేరుతో అకౌంట్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే అసలు ఈ సైలెంట్ రాజకీయ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి..? పంది ముఖాన్ని మాస్క్ గా ధరించి ఏం చేప్పాలనుకుంటున్నారు. కాక్రోచ్ పార్టీ లాంటి వాటికి పోటిగా తీసుకువస్తున్నారా.? ఎవరు టార్గెట్ గా రాబోతున్నారు అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు..రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పోస్టర్లు ఎందుకు సర్క్యులేట్ అవుతున్నాయి. మరి ఆ మాజీ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆయన వెనక ఉన్నది ఎవరనేది మరికొద్ది రోజుల్లో తెలియనుందని టాక్.

అయితే ఈ పోస్టర్ల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో సంచలనం సృష్టించిన 'కాక్రోచ్ పార్టీ' తరహాలో మరో వినూత్న రాజకీయ నిరసనకు తెరతీస్తున్నారా? లేక ప్రస్తుత రాజకీయ నాయకుల తీరుపై, అధికార దాహంపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రచారం వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు, వారి అసలు లక్ష్యం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Perhaps the question isn't just who holds power, but what they do with it #silentpoliticalparty https://t.co/dM9biIUGUI
— Silent political party (@SLNTPolticalPTY) November 19, 2026
రెడ్డిట్ వేదికగా వేడెక్కిన చర్చ
ఈ పంది ముఖం పోస్టర్ పై చర్చ కేవలం దినపత్రికలు, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికలకే పరిమితం కాలేదు. ప్రముఖ ఆన్ లైన్ చర్చా వేదిక రెడ్డిట్‌లోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీల్లోనూ దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇదే పోస్టర్‌ను షేర్ చేస్తూ.. "పాలకులు మారినంత మాత్రాన పాలనలో మార్పు వస్తుందా?" అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ సమస్యలపై గళం: నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ నరకం, అధ్వాన్నంగా మారిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యం, కాలుష్యం, నీటి కొరత వంటి మౌలిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు మారినా ప్రజల కష్టాలు తీరడం లేదని హైదరాబాద్ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులపై ఆందోళన: మరోవైపు ఏపీ కమ్యూనిటీలో తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాల లేమి, శాంతిభద్రతల పరిస్థితి, ముఖ్యంగా చిన్నారులపై జరుగుతున్న నేరాల పట్ల నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జవాబుదారీతనమే అసలైన మార్పు!
ఈ పోస్టులపై స్పందిస్తున్న పలువురు నెటిజన్లు ఆసక్తికర అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కేవలం నాయకుల ముఖాలు, పార్టీల జెండాలు మారడంతో వ్యవస్థ బాగుపడదని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉన్నప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో ప్రజల ఓటింగ్ విధానం, ఆ తర్వాత నాయకుల పనితీరును నిరంతరం ప్రశ్నించే తత్వం కూడా మార్పులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటున్నారు.
మొత్తానికి అధికారంలో ఎవరున్నారన్నది కాదు.. ఆ అధికారంతో ఏం చేస్తున్నారన్నదే ముఖ్యం అనే ఇతివృత్తంతో సాగుతున్న ఈ 'సైలెంట్ పొలిటికల్ పార్టీ'ప్రచారం వెనుక నిజంగానే ఓ కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోందా? లేక ఇదొక సామాజిక చైతన్య కార్యక్రమమా? లేక ఏదైనా సినిమా ప్రమోషన్ స్టంటా? అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.














Click it and Unblock the Notifications
