ఆయుర్వేద మెడికల్ టూరిజంగా తిరుపతి.. 24 రాష్ట్రాలతో పోటీలో ఏపీ!
దేశవ్యాప్తంగా ఆయుర్వేద వైద్య విద్య, పరిశోధనలు, అత్యాధునిక చికిత్స సదుపాయాలను విస్తరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు అఖిల భారత ఆయుర్వేద సంస్థ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకదానిని ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో నెలకొల్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ క్యాంపస్‌ల కోసం తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో, తిరుపతికి ఉన్న ప్రత్యేక అనుకూలతలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనలను సమర్పించింది. పోటీ తీవ్రత దృష్ట్యా 100 మార్కుల 'ఛాలెంజ్ మెథడ్' ద్వారా అర్హత కలిగిన ప్రాంతాలను ఎంపిక చేయాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

ఈ విధానంలో భాగంగా వివాద రహితమైన 50 నుంచి 100 ఎకరాల ఉచిత భూమి, రవాణా అనుసంధానం, 10 మెగావాట్ల విద్యుత్తు, రోజుకు 1 ఎంఎల్‌డీ మంచినీటి సరఫరా, మురుగుపారుదల వ్యవస్థతో పాటు అధ్యాపకులు, సిబ్బంది కుటుంబాలకు సమీపంలో విద్యా, వైద్య సదుపాయాలు వంటి అంశాలకు మార్కులు కేటాయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండియన్ ఇటీవల దిల్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వాదనను సమర్థంగా వినిపించారు.
తిరుపతి ఈ సంస్థ ఏర్పాటుకు అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు కోసం రూ.350 కోట్ల షరతులు లేని ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకొచ్చింది. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయంలో ఉన్న 60 ఎకరాల తితిదే భూమిని కేంద్రం ఆమోదించిన వారంలోనే అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
చెన్నై-అనంతపురం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ స్థలం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి కేవలం 1.8 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్, బస్టాండ్‌లకు 5 కిలోమీటర్లు, విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం రవాణాపరంగా పెద్ద సానుకూలతగా నిలుస్తోంది. ఏపీ సింగిల్ విండో డెస్క్ పోర్టల్ ద్వారా కేవలం 21 నుంచి 30 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
అంతేకాకుండా రెండు సబ్‌స్టేషన్ల ద్వారా 10 నుంచి 15 మెగావాట్ల నిరంతర విద్యుత్తు, 2 ఎంఎల్‌డీ శుద్ధజలాల సరఫరా, డ్రైనేజీ, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. సంస్థ కార్యకలాపాలను తక్షణమే ప్రారంభించేందుకు తాత్కాలిక ప్రాంగణంగా ఎస్వీ ఆయుర్వేద కళాశాల, 200 పడకల బోధనాసుపత్రితో పాటు వేదిక్ విశ్వవిద్యాలయంలోని ఐదు అంతస్తుల భవనాన్ని వాడుకోవచ్చని సూచించింది.
ప్రస్తుతం ఢిల్లీలోని సరితా విహార్‌లో ప్రధాన ఏఐఐఏ క్యాంపస్ విజయవంతంగా సేవలందిస్తుండగా, గోవాలో మరొక క్యాంపస్ ఏర్పాటైంది. శేషాచల అడవుల్లో అపారమైన ఔషధ మొక్కల జీవవైవిధ్యం, నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే తిరుమల క్షేత్ర సమీపంలో ఏఐఐఏ ఏర్పడితే రాయలసీమతో పాటు పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు కూడా నాణ్యమైన ఆయుర్వేద వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇది తిరుపతిని అంతర్జాతీయ మెడికల్ టూరిజం, ఆయుర్వేద పరిశోధనల కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.












Click it and Unblock the Notifications
