డబ్ల్యూటీసీ ఫైనల్ సినారియో: టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో భారత్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్‌లో చివరి రోజు కివీస్ బ్యాటర్లు పట్టుదలతో నిలబడటంతో విజయం చేజారింది. ఈ డ్రాతో లభించిన నాలుగు పాయింట్లతో సంతృప్తి పడాల్సి వచ్చిందే తప్ప డబ్ల్యూటీసీ పాయింట్లు ఏ మాత్రం మెరుగుపడలేదు. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్లు మరింత తగ్గాయి.
టీమిండియా పాయింట్ల శాతం 51.52 నుంచి 50.00 శాతానికి పడిపోయింది. దీంతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి దిగజారింది. మొదటి ఇన్నింగ్ లో 702/9 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది గానీ.. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కూల్చడంలో చేతులెత్తేసింది. డారిల్ మిఛెల్, గ్లెన్ ఫిలిప్స్ ఓర్పుగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ ఏకంగా 43 ఓవర్ల పాటు క్రీజ్ లో నిల్చొన్నారు. ఇన్ని ఓవర్లలోనూ బౌలర్లు వీరి జోడీని విడగొట్టలేకపోయారు.

దీంతో 120 ఓవర్లలో న్యూజిలాండ్ 239/5 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 2009 నుంచి న్యూజిలాండ్ గడ్డపై టెస్టు విజయం సాధించాలన్న భారత్ ఎదురుచూపులు మరోసారి అడుగంటినట్టయింది. ఈ డ్రా దెబ్బ.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావం చూపింది. దక్షిణాఫ్రికా 75.00 విజయ శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా 69.23 శాతంతో రెండో స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ 66.67 శాతంతో మూడో స్థానంలో నిలిచింది.
భారత్ 50.00 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో ఇంగ్లాండ్‌తో సిరీస్ డ్రా, వెస్టిండీస్‌పై విజయం, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి, శ్రీలంకపై గెలుపు తర్వాత వెల్లింగ్టన్ మ్యాచ్ డ్రా కావడం భారత్‌కు పాయింట్ల పరంగా భారీగా నష్టాన్ని కలిగించింది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో టీమిండియాకు ఇంకా ఆరు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో ఒకటి.. న్యూజిలాండ్ పైనే.
ఈ నెల 27వ తేదీ నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుందీ మ్యాచ్. దీని తర్వాత జనవరి- ఫిబ్రవరిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే అయిదు టెస్టుల సిరీస్ టీమిండియాకు అత్యంత కీలకం కానుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే ఇకపై టీమిండియా ఏ ఒక్క మ్యాచ్ ను కూడా ఓడిపోకూడదు. అలాగని డ్రా కూడా కాకూడదు. ఈ రెండింట్లో ఏది జరిగినా గానీ.. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. పాయింట్ల శాతాన్ని గరిష్టంగా 66.67 శాతానికి పెంచుకోవాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లోనూ భారత్ గెలిచి తీరాల్సి ఉంటుంది.
మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో గెలిచినప్పటికీ భారత్ ఫైనల్ అర్హత సాధించడం పూర్తిగా ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది. పాయింట్ల పట్టికలో పైన ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఆడే రాబోయే సిరీస్‌ల ఫలితాలు కూడా భారత అవకాశాలను నిర్దేశిస్తాయి. ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌తో నాలుగు, దక్షిణాఫ్రికా శ్రీలంక, ఇంగ్లాండ్‌లతో టెస్ట్ మ్యాచ్ లు ఇంకా ఆడాల్సి ఉంది.














Click it and Unblock the Notifications
