కొంపముంచిన శుభ్‌మన్ గిల్ తొందరపాటు నిర్ణయాలు
భారత్ తో వెల్లింగ్టన్ లో వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో న్యూజిలాండ్ సత్తా చాటింది. టీమిండియా బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొంటూ భారీ స్కోర్ సాధించింది. 70 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన దశ నుంచి ఈ జట్టు ఎదిగిన క్రమం.. అబ్బురపరిచింది. అసలు సిసలు టెస్ట్ మ్యాచ్ మజాను రుచి చూపించింది. మొదటి ఇన్నింగ్ లో న్యూజిలాండ్ 368 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్ లో రెండు భారీ సెంచరీలు నమోదయ్యాయి.
మ్యాచ్ స్కోర్ మొత్తం కూడా ఇద్దరు బ్యాటర్లే చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ 175 పరుగులతో అజేయుడిగా నిలవగా.. మిడిలార్డర్ లో గ్లెన్ ఫిలిప్స్ 118 పరుగులతో వెన్నెముక అయ్యాడు. బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. వీరిద్దరి తర్వాత న్యూజిలాండ్ ఇన్నింగ్ లో నమోదైన అత్యధిక వ్యక్తిగత పరుగులు 15 మాత్రమే. రచిన్ రవీంద్ర ఈ స్కోర్ చేశాడు. నాథన్ ఎల్లిస్- 14, కైలె జెమిసన్- 11 మాత్రమే డబుల్ డిజిటల్ స్కోర్ అందుకోగలిగారు.

ఈ మ్యాచ్ లో డీఆర్ఎస్ నిర్ణయాలు నిరాశపరిచాయి. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్ల జట్టు తొలి ఇన్నింగ్స్‌లోనే మూడు రివ్యూలను కూడా కోల్పోయింది. ఈ మూడింట్లో ఏ ఒక్కటి కూడా టీమిండియాకు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ విషయంలో తోటి ప్లేయర్లు, వికెట్ కీపర్ ఇచ్చే సూచనలను సరిగ్గా అంచనా వేయడంలో గిల్.. విఫలం అయ్యాడు. ఇది మ్యాచ్ ను తలకిందులు చేసింది.
డీఆర్ఎస్ విషయంలో గిల్ కు బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉందనేది తెలిసిందే. అతను రివ్యూ తీసుకున్న ప్రతీసారీ ప్రత్యర్థి జట్టుకే అనుకూలంగా ఫలితం వెలువడింది. వెల్లింగ్టన్ లోనూ అదే పునరావృతమైంది. మొదటి రోజు ఆటలో జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో గ్లెన్ ఫిలిప్స్ ఎల్బీడబ్ల్యూ కోసం గిల్ మొదటి రివ్యూ కోరాడు. బంతి వికెట్ల పైనుంచి వెళ్తోందని బుమ్రా స్వయంగా సూచించినప్పటికీ.. గిల్ పట్టించుకోలేదు. రివ్యూకు వెళ్లి మొదటి అవకాశం వృధా చేసుకున్నాడు.
దీని తర్వాత అన్షుల్ కాంబోజ్ బౌలింగ్ రచిన్ రవీంద్ర అవుట్ అయినప్పటికీ.. డీఆర్ఎస్ కు వెళ్లలేదు గిల్. కాంబోజ్ వేసిన అవుట్ స్వింగర్ రచిన్ బ్యాట్‌ను తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. పంత్, స్లిప్ ఫీల్డర్లు రివ్యూ తీసుకోవాలని కోరినప్పటికీ.. గిల్ నిరాకరించాడు. అల్ట్రా ఎడ్జ్ రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.
రెండో రోజు ఆటలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఆకాశ్ దీప్ బౌలింగ్ లో నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీపై కోరిన రెండు రివ్యూలు కూడా విఫలం అయ్యాయి. హెన్రీ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కీపర్ పంత్ గానీ, బౌలర్ ఆకాశ్ గానీ ఎలాంటి అపీల్ చేయలేదు. స్లిప్‌లో ఉన్న గిల్ మాత్రం అత్యుత్సాహం చూపించాడు. రివ్యూ కోరాడు. బంతి, బ్యాట్‌కు సంబంధమే లేదని రీప్లేలో స్పష్టంగా తేలింది. దీంతో భారత్ తన చివరి రివ్యూను కూడా కోల్పోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications
