India vs New Zealand: మళ్లీ బౌలర్లు విఫలం- కివీస్ తో తొలి టెస్టు ఫలితమిదే..!
భారత్-న్యూజీలాండ్ (India vs New Zealand) మధ్య వెల్లింగ్టన్ లో జరిగిన తొలిటెస్టు ఆసక్తికర మలుపులు తిరిగి చివరికి ఇవాళ ఐదో రోజు ఊహించని ఫలితంతో ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజీలాండ్ చేసిన 368 పరుగుల స్కోరుకు సమాధానంగా ఏకంగా 720 పరుగులు చేసి డిక్లేర్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ బ్యాట్స్ మెన్ ను త్వరగా అవుట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వెల్లింగ్టన్ టెస్టులో విజయం సాధిస్తుందనుకున్న భారత్ కాస్తా..ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించుకోవాల్సి వచ్చింది.
నిన్న నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లకు 119 పరుగులు చేసిన న్యూజీలాండ్ ను ఇవాళ భారత బౌలర్లు త్వరగా అవుట్ చేస్తే ఈ మ్యాచ్ గెలిచేందుకు భారత్ కు అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ భారత బౌలర్లు మాత్రం ఐదో రోజు వెల్లింగ్టన్ పిచ్ పై ఆ మ్యాజిక్ చేయలేకపోయారు. ఉదయం డ్రింక్స్ బ్రేక్ సమయానికి నిన్న అర్ధసెంచరీ సాధించిన డెవాన్ కాన్వే వికెట్ మాత్రమే తీయగలిగారు. అనంతరం రచిన్ రవీంద్ర, బ్లండెల్ ను అవుట్ చేసినా ఆ తర్వాత మాత్రం డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ జోడీ భారత బౌలర్లను సమర్ధంగా అడ్డుకుంది.

క్రీజులో పాతుకుపోయిన మిచెల్, ఫిలిప్స్ జోడీని విడదీసేందుకు కెప్టెన్ గిల్ తన వద్ద ఉన్న అన్ని ఆప్షన్లను వాడేసినా ఫలితం లేకపోయింది. ఆరో వికెట్ కు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ.. ఆ తర్వాత కూడా మరో వికెట్ పోకుండా కాపాడుకుంది. దీంతో డ్రింక్స్ సమయానికి న్యూజీలాండ్ 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. ఆ తర్వాత మరో 11 పరుగులు జోడించాక.. ఫలితం తేలే పరిస్దితి లేకపోవడంతో ఇరు జట్లూ డ్రాకు అంగీకరించాయి. మిచెల్ 49, ఫిలిప్స్ 26 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 2, బుమ్రా, కాంబోజ్, సుందర్ తలో వికెట్ తీశారు. మిగతా బౌలర్లకు వికెట్లు దక్కలేదు. మొత్తం 8 బౌలర్లను ప్రయోగించినా కివీస్ ను భారత్ ఆలౌట్ చేయలేకపోయింది. నవంబర్ 27న క్రైస్ట్ చర్చ్ లో రెండో టెస్టు ప్రారంభం కానుంది.














Click it and Unblock the Notifications
