Ind vs NZ: భారత బ్యాటర్ల చారిత్రక ఫీట్- 94 ఏళ్ల టెస్టు చరిత్రలో తొలిసారి..!
భారత్-న్యూజీలాండ్ (India vs New Zealand) మధ్య వెల్లింగ్టన్ లో జరుగుతున్న తొలిటెస్టు పలు రికార్డులకు వేదికవుతోంది. ఇప్పటికే భారత జట్టులో పలువురు క్రికెటర్లు వ్యక్తిగత రికార్డులు సాధిస్తుండగా.. ఇప్పుడు ఏకంగా టీమిండియా సమిష్టిగా ఓ చారిత్రక రికార్డు సాధించింది. 94 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి టీమిండియా ఈ రికార్డు అందుకుంది. కివీస్ తో జరుగుతున్న తొలిటెస్టులో భారత టాప్ ఆర్డర్ అద్భుత ప్రదర్శన సాయంతో ఈ అరుదైన ఫీట్ మన సొంతమైంది.
వెల్లింగ్టన్ టెస్టు మూడో రోజు ఆటలో భారత బ్యాటర్లు చెలరేగారు. అద్భుతమైన బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నారు. ఇవాళ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4వికెట్ల నష్టానికి 486 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటికే 118 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది. అయితే ఇందులో భారత టాప్ ఆర్డర్లోని ఐదుగురు బ్యాట్స్ మెన్ కనీసం అర్ధసెంచరీలు సాధించారు. ఇందులో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్ 85, కేఎల్ రాహుల్ 136, దేవదత్ పడిక్కల్ 80, శుభ్ మన్ గిల్ 98, రిషబ్ పంత్ 55 పరుగులు చేశారు.

ఇలా విదేశాల్లో జరిగిన ఓ టెస్టులో భారత టాప్ ఆర్డర్ లోని ఐదుగురు బ్యాట్స్ మెన్ ఇలా కనీసం అర్ధసెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. టెస్టుల్లో భారత బ్యాటర్లు ఈ ఫీట్ సాధించడం వాస్తవానికి ఇది ఐదోసారి. కానీ మిగతా నాలుగు సందర్భాల్లో భారత బ్యాటర్లు స్వదేశంలో ఈ ఘనతను అందుకున్నారు. ఇప్పుడు విదేశీ గడ్డపై సైతం ఈ ఫీట్ సాధించడం ద్వారా చరిత్ర పుటల్లో చోటు సంపాదించారు. దీంతో భారత బ్యాటర్లు స్వదేశంలోనూ కాదు విదేశాల్లో సైతం పులులే అని టీమిండియా నిరూపించింది. అంతే కాదు ఈ టెస్టులో తొలి రోజు ఆట తర్వాత బౌలర్లు ఎదుర్కొన్న విమర్శలకు రెండు, మూడు రోజుల ఆటతో బ్యాటర్లు తగిన సమాధానం చెప్పారు. అలాగే భారత్ వీరి అద్భుత ఇన్నింగ్స్ తో టెస్టు మ్యాచ్ పై పట్టు సాధించింది.














Click it and Unblock the Notifications
