"షర్మిలతో చెట్టపట్టాల్" కథనంపై స్పందించిన చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. ఇదే క్రమంలో పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల తన కుమార్తె అంజిలీ రెడ్డి పెళ్లికి ఆహ్వానం పలికేందుకు సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లారు. ఆయనకు ఆహ్వాన పత్రిక అందించారు. దీన్ని చంద్రబాబుతో షర్మిల చెట్టపట్టాల్ అంటూ సాక్షిపత్రికలో వచ్చిన కథనం తీవ్ర కలకలం రేపింది. దీనిపై ఇప్పటికే షర్మిల స్పందిస్తూ.. అన్న వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు కూడా చేసారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు (Chandrababu) దీనిపై ఇవాళ స్పందించారు.
సాక్షి పత్రిక బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. పీసీసీ ఛీఫ్ షర్మిల తన వద్దకు వచ్చి కుమార్తె పెళ్లికి ఆహ్వానం పలికారన్నారు. గతంలో షర్మిల పెళ్లికి ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తనకు స్వయంగా ఆహ్వానం పలికారని, హైదరాబాద్ లో జరిగిన ఈ పెళ్లికి తాను కూడా హాజరైనట్లు చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. జగన్ పెళ్లికి కూడా పులివెందులకు వెళ్లినట్లు గుర్తొస్తోందన్నారు. ఇప్పుడు షర్మిల తనకు ఆహ్వానం పలికితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

రాజశేఖర్ రెడ్డి, తాను 1978 నుంచి 1983 వరకూ మంచి మిత్రులం అని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత తాను తెలుగుదేశానికి వెళ్తే, ఆయన కాంగ్రెస్ నుంచి తనతో పోరాడినట్లు తెలిపారు. తనతో హోరాహోరీగా పోరాడినా కూడా మానవ సంబంధాలకు మచ్చతెచ్చేలా ఎప్పుడూ ఆయన వ్యవహరించలేదన్నారు. తాను చెన్నారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, ఇందిరాగాంధీ, సోనియాగాంధీతో, రాజీవ్ గాంధీతో కూడా తాను పోరాటాలు చేశానన్నారు. ఒకప్పుడు సిద్దాంతపరంగా పోరాడామని, ఇప్పుడు మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. దీన్ని కూడా చెడుగా చూపిస్తూ మాట్లాడటం ఏ విధంగా సబబని ప్రశ్నించారు. తన సొంత చెల్లి, రక్తం పంచుకున్న వ్యక్తి విషయంలో ఇలా చేయడం సరికాదన్నారు.














Click it and Unblock the Notifications
