తిరుమలలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు- అరుదుగా: ఏడాదికి ఒక్కసారి
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 56,695 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 24,786 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.28 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆరు కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టింది.
నేడు.. కైశిక ద్వాదశి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా ముగిసింది. ఈ తెల్లవారు జామున 4:30 నుండి 5.45 నిమిషాల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు. అశేష భక్తులను కటాక్షించారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్ర శ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగించడం ఆనవాయితీ.

ఊరేగింపు అనంతరం స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయం లోపల తెల్లవారు జామున 6 నుండి ఉదయం 7: 30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా ఘనంగా నిర్వహించారు. పురాణాల ప్రకారం.. శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశిక ద్వాదశి ఒకటి.
శ్రీ వరాహ పెరుమాళ్ కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో శ్రీ భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. సూర్యోదయానికి ముందే ఈ ఊరేగింపును నిర్వహించడానికి కారణాలు లేకపోలేదు.
14వ శతాబ్దంలో సూర్యోదయం అనంతరం ఉగ్ర శ్రీనివాసమూర్తి ఊరేగింపు జరుగుతూ ఉండగా కిరణాలు స్వామివారి విగ్రహం మీద పడగానే భాగీ అగ్ని ప్రమాదం సంభవించిందని, అప్పటి నుండి సూర్యోదయానికి ముందే ఊరేగింపు నిర్వహిస్తున్నామని టీటీడీ వివరించింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో డాక్టర్ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
