తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జరిగేది ఇదే - సినీ, వ్యాపార ప్రముఖులతో తేల్చేసిన అమిత్ షా..!!
తెలంగాణ కేంద్రంగా బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలతో సిద్దం అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ల కాలం పూర్తవుతోంది. 2028 ఎన్నికల కోసం బీజేపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. తటస్థుల ఓట్ల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. మోదీ - షా ద్వయం తెలంగాణ కోసం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. కాగా, తెలంగాణలో వచ్చే ఎన్నికల ఫలితాల పై అమిత్ షా సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల కు స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారుతున్నాయి.
తెలంగాణలో బీజేపీ గెలుపు విషయం తనకు వదిలిపెట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేసారు. తెలంగాణలో వంద శాతం గెలుస్తాం.. గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేసారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనను విడివిడిగా కలిసిన సందర్భంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇవి. తెలంగాణలో ఈ సారి అందులో ఎలాంటి సందేహం లేదనివ్యాఖ్యానించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి, బీజేపీ బలం ఎంత అన్నది పక్కనపెడితే ఆయన అంత నమ్మకంగా, గట్టిగా చెప్పడంపై పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. బీజేపీ రాష్ట్రంలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. అనేక మార్గాల్లో సమాచార సేకరణ చేస్తోంది. వ్యూహకర్తలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాజకీయేతర రంగాల వారిని కలిసి ఇక్కడి పరిస్థితులపై సమాచారం సేకరిస్తున్నారు. కాగా.. రాష్ట్రంలో పొత్తులు లేకుండానే ఎన్నికల బరిలోకి దిగాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అమిత్ షా కొత్త వ్యూహ రచన
తెలంగాణ బీజేపీలో నేతల మధ్య సమన్వయం తీసుకొస్తూనే.. కాంగ్రెస్, అటు బీఆర్‌ఎస్ నుంచి కొందరు నేతలు తమవైపు వస్తారన్న నమ్మకంతో ఉన్నారు. తొలుత బీఆర్‌ఎస్ నుంచి వలసలు ఉంటాయని, కాంగ్రెస్ అధికారపక్షం కాబట్టి ఆ పార్టీ నుంచి ఎన్నికలకు కొన్ని నెలల ముందు చేరికలు ఉంటాయని బీజేపీ అంచనా వేస్తోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలకు స్థానం కల్పిస్తా మని భరోసా ఇస్తూనే, అనేక స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను తీసుకోవాలని భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెరుగుతుందని, దీంతో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు వీలవుతుందని, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను తీసుకున్నా ఇబ్బంది ఉండదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సోషల్ ఇంజనీరింగ్ పక్కాగా చేయటం ద్వారా ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకోవాలని వ్యూహం సిద్దం చేస్తోంది. ప్రధాని మోదీ - అమిత్ షా ఆపరేషన్ తెలంగాణ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతున్న వేళ రానున్న రోజుల్లో జరిగే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications
