వైసీపీ గెలిచిన అనంతపురం మేయర్ ఎన్నిక పై బిగ్ ట్విస్ట్..!!
అనంతపురం మేయర్ పీఠం వైసీపీ దక్కించుకుంది. ఇప్పుడు ఈ ఎన్నిక పైన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో 13 కార్పోరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. వైసీపీ అనంతపురం ఒక్కటి మాత్రమే విజయం సాధించింది. కూటమి సర్దుబాటులో భాగంగా ఇక్కడ బీజేపీ పోటీ అభ్యర్ధి పోటీ చేసారు. వైసీపీ నుంచి రమేష్ గౌడ్ మేయర్ గా విజయం సాధించారు. ఇక్కడ కూటమి ఓటమి పైన ముఖ్య నేతలు చేసిన సమీక్షలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాగా.. ఇప్పుడు ఈ ఎన్నిక పైన చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అనంతపురం కార్పోరేషన్ మాత్రమే దక్కిచుకుంది. ఇక్కడ గెలుపు వెనుక అనేక సమీకరణాలు పని చేసాయి. కూటమి నేతలు సైతం వైసీపీ విజయం పైన సమీక్ష చేసారు. స్థానిక నాయకత్వంతో పాటుగా బీజేపీకి కేటాయించటం ప్రధాన కారణంగా విశ్లేషణలు వచ్చాయి. కాగా, ఇప్పుడు అనంతపురం నగర మేయర్ ఎన్నికపై బీజేపీ నేత అజేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్‌పై తనకు అనుమానాలు ఉన్నాయని, రీ కౌంటింగ్ చేయించాలని విన్నవించారు. ఈమేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జిల్లా ప్రధాన న్యాయాధికారి భీమారావు సమక్షంలో గంటకుపైగా వాదనలు జరిగాయి. దీనిపై శనివారం తీర్పు వెలువడే అవకాశం ఉంది. జిల్లా కోర్టులో అనుకూల తీర్పు రాకపోతే, హైకోర్టుకు వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ కార్పొరేటర్ సీట్లను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలిచింది. మేయర్ సీటు మాత్రం వైసీపీకి వెళ్లింది.

కోర్టులో బీజేపీ పిటీషన్
కాగా, అనంతపురం ఎన్నికల కౌంటింగ్‌పై మొదటి నుంచి బీజేపీ అభ్యర్థి అజేష్ బాబు అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్, కౌంటింగ్, ఆర్వో వ్యవహరించిన తీరుపై పలుమార్లు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండటం, 7వ రౌండ్లో వైసీపీకి అసాధారణ మెజారిటీ రావడం, కౌంటింగ్ హాల్లో బయటి వ్యక్తులు తిరగడం, అదనపు కౌంటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం తదితర పరిణామాలపై అజేష్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు చేసిన ఫిర్యాదులపై ఫలితం లేకపోవడంతో బీజేపీ పెద్దల ఆదేశాలతో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించినట్టు చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టుకు చేరటంతో అక్కడ జరిగే వాదనలు.. న్యాయస్థానం వెల్లడించే నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications
