యూనివర్సిటీల పోస్టుల భర్తీపై మరో కీలక కసరత్తు!
తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో మొత్తం 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. విభాగాల వారీగా ఖాళీలను కేటాయిస్తూ నెల రోజుల క్రితం జీఓ 142 వెలువడింది. ఇందులో అత్యధికంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 252 పోస్టులు దక్కాయి. అయితే, క్షేత్రస్థాయిలో ప్రస్తుత విద్యా అవసరాలను, విద్యార్థుల ప్రవేశాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే దశాబ్దాల నాటి పాత లెక్కల ఆధారంగా పోస్టులు కేటాయించారన్న చర్చ విద్యా వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఉస్మానియా యూనివర్సిటీలో 1957లో ప్రారంభమైన రష్యన్ విభాగం కాలక్రమేణా విద్యార్థుల ఆదరణ తగ్గి 2013 నాటికే దాదాపు నిలిచిపోయింది. అయినప్పటికీ ఆ విభాగానికి తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కేటాయించడం గమనార్హం. యూజీసీ సహకారంతో 1983లో ఏర్పాటైన సెంటర్ ఫర్ ఇండియన్ ఓషన్ స్టడీస్ కూడా ఐదేళ్ల క్రితమే కార్యకలాపాలు నిలిపేసింది. ఇప్పుడు దానికి నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరయ్యాయి.

మరోవైపు ఆరేడు దశాబ్దాల క్రితం జర్మన్, ఫ్రెంచ్, పర్షియన్, అరబిక్, తమిళం, కన్నడం, మరాఠీ, ఉర్దూ వంటి 13 భాషా విభాగాలు ఉండేవి. వాటిలో కొన్నింట ప్రవేశాలు పడిపోయి కేవలం నామమాత్రంగా కొనసాగుతున్నప్పటికీ, వాటికి కూడా ఒకటి నుంచి మూడు చొప్పున పోస్టులు కేటాయించారు. ఈ పరిణామాలపై ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కుమార్ మొలుగరం స్పందిస్తూ, రష్యన్ విభాగంతో పాటు ఓషన్ స్టడీస్ కేంద్రం మూతపడిన మాట నిజమేనని తెలిపారు
మరో నాలుగైదు విభాగాల్లోనూ విద్యార్థులు లేని పరిస్థితి ఉందని, వాటిపైనా సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా కొన్ని విభాగాల పోస్టులను ఇతర విభాగాలకు బదలాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. దీంతో పాటు మహాత్మాగాంధీ, శాతవాహన వంటి విశ్వవిద్యాలయాలకు అదనపు పోస్టుల కేటాయింపుపై ప్రభుత్వం మరో జీఓ జారీ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి నియామకాలు చేపట్టడం లేనందున, వాటిలో కొన్ని పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలుగా మార్చుకుని ప్రస్తుత భర్తీ ప్రక్రియలోనే చేర్చుకోవాలన్న ప్రభుత్వ సూచనల మేరకు విశ్వవిద్యాలయాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఉదాహరణకు పది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉంటే వాటిలో ఐదింటిని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా మార్చుకుంటామని, భవిష్యత్తులో కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరైనప్పుడు ప్రస్తుతం ఆ స్థానాల్లో ఎంపికయ్యే వారిని సర్దుబాటు చేస్తామని ఒక విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వివరించారు.
ఈ పద్ధతి ద్వారా అదనంగా మరో 200 వరకు పోస్టులు అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కూడా ఇదే తరహాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రిజిస్ట్రార్ రామచంద్రం పేర్కొన్నారు.విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలు జరగడం అకడమిక్ పరిశోధనలకు, బోధన నాణ్యతకు ఊతమిస్తుంది. అయితే, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న లేదా కోర్సులు మూతబడిన విభాగాల్లో ఖాళీలు నింపడం వల్ల బోధనా సమయం, వనరులు సమర్థంగా వినియోగం కాకపోయే ప్రమాదం ఉంది.
మరోవైపు కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, లైఫ్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ వంటి కొత్త తరం కోర్సుల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కడ అధ్యాపకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలు, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సూచనలు, అకడమిక్ కౌన్సిల్ ఆమోదాలతో ప్రతి విభాగంలోని విద్యార్థుల సంఖ్య, కోర్సుల ఆవశ్యకత ఆధారంగా పోస్టుల పునర్వ్యవస్థీకరణ జరిగితేనే నియామకాలకు పూర్తి ప్రయోజనం చేకూరుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.













Click it and Unblock the Notifications
