చైనా నుంచి రాగానే భారత్ పై డొనాల్డ్ ట్రంప్.. !!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన కొన్ని గంటల్లోనే వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. క్వాడ్ సమ్మిట్, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ తో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో చర్చలకు వచ్చిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ ఆర్థిక వృద్ధి విధానాలను డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారీ సందర్భంగా. వీటిని ప్రశంసించారు. తన దేశానికే చెందిన సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరిస్తోన్న సరళ ఆర్థిక విధానాలు ఆ దేశ పురోగతికి ఊతం ఇస్తోన్నాయని వ్యాఖ్యానించారు. అనుకూల వడ్డీ రేట్ల విధానాలు.. భారత్ ఆర్థికశక్తిగా ఎదిగేలా దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

అమెరికాలో కూడా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించి ఉంటే తమ దేశ జీడీపీ సులభంగా 15 నుంచి 20 శాతానికి చేరుకునేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ దేశంలో ఆర్థిక వృద్ధి మందగించడానికి, జీడీపీ రేటు నాలుగు శాతానికే పరిమితం కావడానికి సెంట్రల్ బ్యాంక్ కఠిన నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు. వడ్డీ రేట్లను మరింత సరళీకరించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థ ఒక రాజకీయ సంస్థలా ప్రవర్తిస్తోందని ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక్కడ వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వల్ల ఆర్థిక పురోగతికి ఆటంకం కలుగుతోందని తేల్చి చెప్పారు. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గిస్తే తాము చెల్లించాల్సిన అప్పుల భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఆదాయం వడ్డీ చెల్లింపులకే సరిపోతోందని పేర్కొన్నారు. వీటిని తగ్గిస్తే పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని, నూతన పెట్టుబడులు పెరిగి ఉద్యోగావకాశాలు విస్తరిస్తాయని స్పష్టం చేశారు.
భారత్ తన ఆర్థిక విధానాలను సమతుల్యంగా ఉంచుకోవడం వల్లే దాదాపు ఏడు శాతం జీడీపీ వృద్ధిని సాధించగలుగుతోందని ట్రంప్ గుర్తు చేశారు. 2018లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధిపతిగా జెరోమ్ పోవెల్‌ను తానే నియమించానని, అయినప్పటికీ వడ్డీ రేట్ల తగ్గింపుపై తన అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు వెలువడ్డాయని అన్నారు. కాగా.. ఈ ఏడాదే పోవెల్ పదవీకాలం ముగిసింది. అనంతరం కేవిన్ వార్ష్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.













Click it and Unblock the Notifications
