రాబోయే రోజుల్లో కేప్టెన్ గా కొనసాగడంపై తేల్చి చెప్పిన పాట్ కమ్మిన్స్
వివాదాస్పద శాండ్ పేపర్ గేట్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతం.. క్రికెట్ ఆస్ట్రేలియాకు కుదిపేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తెరపైకి తీసుకొచ్చిన ఈ అంశంపై డేవిడ్ వార్నర్, స్పిన్ బౌలర్ నాథన్ లియాన్ వంటి ప్లేయర్లు స్పందించడం, దీనికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం మరింత దుమారాన్ని రేపింది. దీంతో.. బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన వారికి ఉద్వాసన తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఈ అంశంపై తాజాగా ఆ జట్టు టెప్ట్ కేప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. బాల్ ట్యాంపరింగ్ మళ్లీ తెరపైకి వచ్చినప్పటికీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకునే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు తలెత్తిన వివాదాలకు పెద్దగా దృష్టి సారించట్లేదని, రాబోయే రోజుల్లో జట్టును ముందుండి నడిపించడమే ప్రస్తుతం తన ముందు ఉన్న ఏకైక ప్రాధాన్యత అంశమని వెల్లడించారు. ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం బాధ్యతతో కూడుకున్నదని, దీన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోలేదని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనలపై సమగ్ర సమాచారం సేకరించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రత్యేక ఫోరమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పాట్ కమ్మిన్స్ తెలిపాడు. 2018 నాటి పర్యటనలో భాగమైన ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ తమ అనుభవాలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ఇది సరైన వేదిక అని పేర్కొన్నాడు. ఈ ప్రక్రియలో తాను ఖచ్చితంగా భాగమవుతానని, అది తన బాధ్యత అని చెప్పాడు.
ఉస్మాన్ ఖవాజా రాసిన సబ్ర అనే ఆత్మకథ విడుదలైన తర్వాత ఈ శాండ్ పేపర్ బాల్ ట్యాంపరింగ్ వివాదం మళ్లీ తెరమీదికి వచ్చిన విషయం తెలిసిందే. కామరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ కు మాత్రమే పరిమితం కాలేదని, జట్టులోని ఇతరులకు కూడా దీనిపై ముందే అవగాహన ఉందనే విషయాన్ని ఇందులో పొందుపరిచాడు. ఈ వివాదం నేపథ్యంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఏడాది పాటు సస్పెండ్ కు గురయ్యారు.
ఈ వివాదం ముదిరిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా.. పాట్ కమిన్స్‌కు అండగా నిలిచింది. అతన్ని టెస్ట్ ఫార్మట్ కేప్టెన్ గా కొనసాగించాలని బోర్డ్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. సీఏ ఛైర్మన్ డేవిడ్ బూన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్‌బర్గ్ సిడ్నీలో కమిన్స్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. అతని కేప్టెన్సీలో జట్టులో క్రమశిక్షణ, ప్లేయర్లల్లో సానుకూల వైఖరి పట్ల బోర్డు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. కెప్టెన్‌గా కమిన్స్ నైతికతపై ఎలాంటి సందేహాలు లేవని కూడా డేవిడ్ బూన్ తేల్చిచెప్పారు.
ఆస్ట్రేలియా డిసెంబర్ 9 నుంచి న్యూజిలాండ్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. పెర్త్ లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీలలో వరుసగా మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ అత్యంత కీలకం కూడా.












Click it and Unblock the Notifications
