మెడికల్ టూరిజంలో గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్ .. మాస్టర్ ప్లాన్!
హైదరాబాద్ ను మెడికల్ టూరిజంలో గ్లోబెల్ హబ్ గా మార్చాలని తెలంగాణా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గ్లోబెల్ సమ్మిట్ వేదికగా దీని కోసం మాస్టర్ ప్లాన్ చేస్తోంది. ఆరోగ్య రంగంలో తెలంగాణను ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, హాస్పిటళ్ల యాజమాన్యాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు ఉన్న వైద్యరంగ సామర్థ్యాన్ని మరింత విస్తరించి, మెడికల్ టూరిజంలో నగరాన్ని గ్లోబల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్ర సెక్రటేరియట్‌లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య రంగాల్లో వస్తున్న మార్పులు, తెలంగాణలో వైద్య సేవల విస్తరణ, మెడికల్ టూరిజం అభివృద్ధి, వైద్య విద్య, నైపుణ్యాల పెంపు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ప్రపంచస్థాయి వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని సమన్వయం చేసుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో హెల్త్‌కేర్ రంగ ప్రతినిధులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.
మెడికల్ టూరిజం అభివృద్ధికి ప్రైవేటు రంగంతోపాటు ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్, నిమ్స్, అల్వాల్ టిమ్స్, కొత్తపేట టిమ్స్‌లలో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం వార్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో ఉన్న అత్యుత్తమ వైద్య నైపుణ్యాలు, మౌలిక సదుపాయాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా విదేశీ రోగులకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చన్నారు.
ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మెడికల్ టూరిజం అభివృద్ధి కోసం ఆరోగ్యశాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో పాల్గొన్న డాక్టర్లు మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అంతర్జాతీయ రోగులకు అవసరమైన సేవలు, సమన్వయం, ఇతర సదుపాయాలను ఒకే వ్యవస్థ ద్వారా అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని ప్రైవేటు హాస్పిటళ్ల డాక్టర్లు తెలిపారు. జాయింట్ రీప్లేస్‌మెంట్, న్యూరో సర్జరీ, కార్డియో థొరాసిక్ సర్జరీ వంటి ప్రత్యేక వైద్య విభాగాల్లో ప్రభుత్వ సర్వీసులో కొత్తగా చేరే వైద్యులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిమ్స్-సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురువా రెడ్డి, ఇతర వైద్యులు వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో హానరరీ ప్రొఫెసర్లుగా సేవలందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
దీనిపై మంత్రి స్పందిస్తూ.. ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేద, మధ్యతరగతి రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ క్రమంలో ప్రైవేటు రంగంలోని అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు, నైపుణ్యాలను తప్పకుండా వినియోగించుకుంటామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సంస్థల మధ్య పరస్పర సహకారం పెరిగితే వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.













Click it and Unblock the Notifications
