రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లపై నిషేధం ? కేంద్రానికి సుప్రీం కీలక సూచన..!
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న రక్త సంబంధీకులు, బంధువుల మధ్య పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. వీటి వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్రానికి కీలక సూచనలు చేసింది. సమీప రక్త సంబంధీకుల మధ్య పెళ్లిళ్లను నిషేధించడానికి చట్టం అవసరమా కాదా పరిశీలించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. అయితే తాము ఆదేశాలు ఇవ్వడం లేదని, కేవలం అవగాహన కల్పించాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రక్త సంబంధీకుల మధ్య వివాహాలను తాము నియంత్రించలేమని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, వి.మోహనతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పేసింది. సామాజిక సంస్కరణల చట్టం ద్వారా ఇలాంటి పెళ్లిళ్లను నియంత్రించడం పూర్తిగా చట్టసభల పరిధిలోకి వస్తుందని వ్యాఖ్యానించింది. కేవలం ఆచారం ప్రకారం పిల్లలను ఊహించదగిన, నివారించగల జన్యుపరమైన హానికి గురిచేసే పద్దతిని చట్టం అనుమతించాలా వద్దా అనే విషయాన్ని పరిశీలించాలని కోరుతూ బెంగళూరుకు చెందిన న్యాయవిద్యార్దిని చార్వి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

రక్తసంబంధీకుల మధ్య పెళ్లిళ్లకు సంబంధించి ప్రజల్లో, విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా సరైన సిలబస్ తో పాటు వివిధ మార్గాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేందుకు వీలుగా కేంద్రానికి సూచనలు చేసేందుకే తాము నోటీసు జారీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అంతే తప్ప తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయడం లేదని స్పష్టత ఇచ్చింది. ఈ మధ్య వైద్య అధ్యయనాల ప్రకారం సగోత్ర వివాహాలు హోమోజైగోసిటీని గణనీయంగా పెంచుతాయని, దీని వల్ల పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు, ఇంద్రియ లోపాలు, అభివృద్ది వైకల్యాలు, శిశు మరణాలు, ఇతర ప్రతికూల పరిణామాలు సంభవించే అవకాశం పెరుగుతుందని పేర్కొంది. అందుకే వీటిపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరుకుంటున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.














Click it and Unblock the Notifications
