శుభ్‌మన్ గిల్ బ్యాడ్ లక్.. !!
న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్ లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగుల భారీ స్కోరు సాధించింది. 118 పరుగుల ఆధిక్యతలో నిలిచింది. ఆట ముగిసే సమయానికి రిషభ్ పంత్ 55 పరుగులతో ఉండగా, అతనికి తోడుగా నైట్‌వాచ్‌మన్‌గా అన్షుల్ కంబోజ్ పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. టీ20 శైలిలో విరుచుకుపడ్డ జైస్వాల్ 89 బంతుల్లోనే 16 ఫోర్లతో 85 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ సైతం సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ 175 బంతుల్లో 10 ఫోర్లతో 80 పరుగులు జోడించాడు. న్యూజిలాండ్ పేసర్ల స్వింగ్‌ను అడ్డుకుంటూ వీరిద్దరూ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు.

సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ 290 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 136 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమైన ఆటతీరు కనపర్చాడు. 146 బంతుల్లో 98 పరుగులు చేసిన గిల్.. సెంచరీకి రెండు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
ఇన్నింగ్ చిట్టచివరి ఓవర్ లో గిల్ అవుట్ అయ్యాడు. ఇంకో రెండు బంతులు ఎదుర్కొని ఉంటే మూడో రోజు ఆట ముగిసేది. ఇన్నింగ్ చివరి ఓవర్ లో డఫీ వేసిన తొలి మూడు బంతులు డాట్ ఆడాడు గిల్. నాలుగో బంతి మాత్రం అతని అంచనాలకు అందలేదు. మిడిల్ స్టంప్ పై పిచ్అయిన బంతి స్వింగ్ అయింది. దాన్ని గిల్ అంచనా వేయలేకపోయాడు. ఫ్రంట్ ఫుట్ పుష్ కోసం ప్రయత్నించాడు. బంతి ప్యాడ్‌కు తగిలి, స్టంప్స్ పైకి దూసుకెళ్లింది. ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టింది.
టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా అర్ధశతకాలు, శతకాలతో రాణించడంతో న్యూజిలాండ్ బౌలింగ్ ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తన మార్క్ అగ్రెసివ్ బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.. పంత్. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్ తలొక వికెట్ దక్కించుకున్నారు.














Click it and Unblock the Notifications
