హైదరాబాద్ మెటా ఆఫీసుపై యూత్ కాంగ్రెస్ దాడి- అకౌంట్ల బ్లాక్ పై నిరసన..!
మన దేశంలో గతంలో సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా అభ్యంతర కర పోస్టు పెడితే దానిపై రాజకీయ నేతలు తమ అధికారాన్ని ఉపయోగించి వారిపై గరిష్టంగా దేశద్రోహం కేసులు కూడా పెట్టించేవారు. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులు చెల్లవని తేల్చేయడంతో చేసేది లేక ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఒత్తిడి తెచ్చి వాటిని బ్లాక్ చేయిస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు అకౌంట్లు, పోస్టులు బ్లాక్ చేస్తున్న సోషల్ మీడియా సంస్థ మెటా కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ (Youth Congress) కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో మెటా ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి 21 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఈ దాడికి సంబంధించిన వీడియోల్ని యూత్ కాంగ్రెస్ తమ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో మెటా (Meta) హైదరాబాద్ కార్యాలయం! మంటల్లో అనేలా ఓ సింబల్ పెట్టారు. ప్రతిపక్షాల ఖాతాలను నిలిపివేయడం, స్వతంత్ర గళాలను అణచివేయడం ఇక చాలు! అని ఇందులో హెచ్చరించారు. మెటా సంస్థ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని, బీజేపీ ఇచ్చే ఆదేశాలకు కాదన్నారు. 7 రోజుల్లోపు అన్ని ఖాతాలపై ఉన్న ఆంక్షలను తొలగించాలని, లేదంటే మీ కార్యాలయాలన్నింటినీ మూసివేయిస్తామని హెచ్చరించారు. ఈ సెన్సార్‌షిప్‌ను ఆపండి. కౌంట్‌డౌన్ మొదలైంది అంటూ ఈ పోస్టును ముగించారు.

ఈ వ్యవహారంపై బీజేపీ మండిపడింది. హైదరాబాద్ తో పాటు ముంబైలోనూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇలాగే మెటా ఆఫీసులపై దాడులు చేశారని, కాంగ్రెస్ ఓ గూండాల పార్టీ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు హైదరాబాద్ మెటా ఆఫీసును ధ్వంసం చేశారని, ఆ ఘటనను సోషల్ మీడియాలో పెట్టారని, ప్రైవేట్ కంపెనీల కార్యాలయాల్ని ధ్వంసం చేసే కాంగ్రెస్ నమూనాను వారు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో భారత దేశ ఆర్ధిక వ్యవస్థ ఎందుకంత బలహీనంగా ఉండేదో ఈ ఘటన నిరూపిస్తుందన్నారు.














Click it and Unblock the Notifications
