మన భూమికి ఓ తోడు దొరికిందోచ్- కొత్త చందమామ: కారంత సైజు
అంతరిక్షంలో ఓ అరుదైన ఘటన సంభవించింది. సాధారణంగా భూమికి సమీపం నుంచి అస్టరాయిడ్లు దూసుకెళ్తుంటాయి. ఓ అస్టరాయిడ్ మాత్రం భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనైంది. ఇది.. మనం గ్రహం చుట్టూ పరిభ్రమించడం మొదలుపెట్టింది. ఓ చిన్న గ్రహశకలం ఇది. అంతరిక్ష పరిశోధకులు దీనికి మినీ మూన్ గా భావిస్తోన్నారు. 2026 క్యూక్యూ8 అని నామకరణం చేసిన ఈ చిన్న గ్రహశకలం కొద్ది నెలల పాటు భూమి కక్ష్యా పరిధిలోనే సంచరింనుంది.
హంగేరీలోని కొంకోలీ అబ్జర్వేటరీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియన్ సర్నెచ్కీ దీని ఉనికిని మొదట గుర్తించారు. ఈ ఏడాది ఆగస్టు 20న దీని కదలికలపై ఆరా తీశారు. ప్రారంభంలో దీన్ని స్పేస్ జంక్ గా భావించారు. దాని పరిభ్రమణం విభిన్నంగా ఉండటంతో మరింత లోతుగా అధ్యయనం చేశారు. హవాయ్ యూనివర్శిటీకి చెందిన 2.2 మీటర్ల టెలిస్కోప్, లోవెల్ డిస్కవరీ టెలిస్కోప్ సహాయంతో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

Image Credits, Graphics by Earthsky.org
ఆ తర్వాత ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఆధ్వర్యంలోని మైనర్ ప్లానెట్ సెంటర్ ఇది సహజ గ్రహశకలమేనని అధికారికంగా ధృవీకరించింది. ఈ గ్రహశకలం పరిమాణం పరంగా చాలా చిన్నది. దీని వ్యాసం ఒకట్రెండు మీటర్లే. ఓ చిన్న కారు పరిమాణంలో ఉంటుంది. పరిమాణం చిన్నది కావడం వల్ల దీని నుంచి భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు స్పష్టం చేశారు. అతి స్వల్ప కాంతి కలిగి ఉండటం వల్ల సాధారణ కంటితో దీనిని చూడటం సాధ్యం కాదని తేల్చారు. ఈ గ్రహశకలం సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి సుమారు 359 రోజుల సమయం తీసుకుంటుంది.
చంద్రుడు ఓ స్థిర కక్ష్యలో ప్రయాణిస్తుంటాడనేది తెలిసిందే. 2026 క్యూక్యూ8 గ్రహశకలం ప్రయాణ మార్గం దీనికి పూర్తి భిన్నం. ఓ నిర్దుష్ట ఆకారంలో తిరగట్లేదిది. లూప్ ఆకారంలో సంచరిస్తోంది. భూమి, సూర్యుడు.. ఈ రెండింటి గురుత్వాకర్షణ ప్రభావం దీనిపై నిరంతరం పడుతోండటం వల్ల ఓ దారి తెన్నూ ఉండట్లేదు. తాత్కాలికంగా భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి రావడం వల్ల ఇది మన గ్రహం చుట్టూ పరిభ్రమిస్తోంది.
ఈ గ్రహశకలం ప్రతి 10 సంవత్సరాలకొకసారి భూమి కక్ష్యా మార్గాన్ని దాటుకుని వెళ్తుంటుంది. ప్రతిసారీ ఇది భూమి గురుత్వాకర్షణ శక్తికి చిక్కుకోదు. అంతరిక్షంలో దాని ప్రయాణ వేగం, దిశ, భూమికి ఎంత దూరంలో ప్రయాణిస్తోందనే అంశాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం భూమి పరిధిలో ఉన్న ఈ గ్రహశకలం డిసెంబర్, జనవరి నాటికి భూమి గురుత్వాకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. అనంతరం తిరిగి సూర్యుడి చుట్టూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తోన్నారు.
ఈ క్రమంలో ఈ అస్టరాయిడ్ డిసెంబర్ 13న భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ఆ సమయంలో ఇది భూమి నుంచి సుమారు 13.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుంది. ఈ దూరం భూమికి చంద్రుడికి మధ్య ఉన్న సగటు దూరం కంటే దాదాపు 3.5 రెట్లు ఎక్కువ. భూమికి ఓ తాత్కాలిక మినీ మూన్ లభించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు గ్రహశకలాలు భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి వచ్చి కొద్దిరోజుల ఇక్కడే సంచరించాయి.
2020 సీడీ3 అనే గ్రహశకలం దాదాపు మూడేళ్ల పాటు భూమి చుట్టూ తిరిగింది. ఆ తర్వాత తన కక్ష్యను మార్చుకుని వెళ్లిపోయింది. అలాగే 2024 పీటీ5 అనే మరో చిన్న గ్రహశకలం 2024 సెప్టెంబర్ నుంచి నవంబర్ నెలల మధ్య కాలంలో కొన్ని వారాల పాటు భూమికి ఉపగ్రహంగా మారింది. అంతరిక్షంలో భూమితో పాటు పయనించే ప్రతి వస్తువును మిన్నీ మూన్‌గా పరిగణించలేమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
