నేడు, రేపు రాత్రివేళ.. చీకటి ఆకాశంలో కళ్లు మిరుమిట్లు గొలిపే ఉల్కాపాతం
అంతరిక్ష ప్రియులు, ఆకాశంలో జరిగే వింతలను వీక్షించే ఔత్సాహికులకు ఓ అద్భుత ఖగోళ విందు అందుబాటులోకి రానుంది. ప్రతి సంవత్సరం శరదృతువు రోజుల్లో రాత్రి ఆకాశాన్ని మైమరిపించే లియోనిడ్ ఉల్కాపాతం నేడు, రేపు సంభవించబోతోంది. అర్ధరాత్రి వేళ ఈ ఉల్కాపాతం పరాకాష్టకు చేరుకుంటుంది. భూమి తన సూర్య పరిభ్రమణ మార్గంలో ప్రయాణిస్తోన్నప్పుడు 55పీ/టెంపెల్ టాటిల్ అనే తోకచుక్క విడిచిపెట్టిన ధూళి, శకలాల గుండా వెళ్లడం వల్ల ఈ ఖగోళ అద్భుతం సంభవిస్తుంది.
రాత్రి వేళ ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతిరేఖలు అత్యంత వేగంగా దూసుకుపోతూ వీక్షకులకు ఓ ప్రత్యేకానుభూతిని అందిస్తాయి. ఇంటర్నేషనల్ మెటియోర్ ఆర్గనైజేషన్ వివరాల ప్రకారం నేడు, రేపు రాత్రి వేళ సంపూర్ణ చీకటి వాతావరణం ఉంటే గనక గంటకు గరిష్టంగా 15 నుంచి 20 ఉల్కలను చూడొచ్చు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మాత్రం ఈ సంఖ్యను తగ్గించింది. గంటకు సుమారు మూడు నుంచి నాలుగు ఉల్కలు మాత్రమే కనిపిస్తాయని అంచనా వేసింది.

లియోనిడ్ ఉల్కలు భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అత్యంత వేగంగా మండిపోతూ, సుదీర్ఘమైన కాంతిరేఖలను ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూ వాతావరణపు ఎగువ పొరలను తాకి మెరుస్తూ సుదూరం ప్రయాణినిస్తాయి. లియోనిడ్ ఉల్కాపాతాన్ని అత్యంత స్పష్టంగా వీక్షించడానికి ఈ నెల 18వ తేదీ బుధవారం తెల్లవారుజాము సమయం అత్యంత అనుకూలమైనదిగా మెటియోర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
ఆకాశంలో ఆగ్నేయ దిశలో ఉన్న సింహ రాశి పరిసరాల నుంచి ఈ ఉల్కలు ఉద్భవించడాన్ని మనం కళ్లారా చూడొచ్చు. తెల్లవారడానికి ముందే చంద్రుడు అస్తమించడం వల్ల ఆకాశం పూర్తి చీకటిగా మారుతుంది. చిన్న చిన్న ఉల్కలు కూడా స్పష్టంగా కనిపించే అవకాశం మరింత మెరుగుపడుతుంది. ఆకాశం నిర్మలంగా.. ఎలాంటి మేఘాలు లేకపోతే ఈ లియోనిడ్ ఉల్కాపాతం స్పష్టంగా మన కంటికి కనిపిస్తుంది. బైనాక్యులర్లు, స్పేస్ టెలిస్కోప్ ఉంటే ఇంకా మంచిది.
విద్యుద్దీపాల కాంతులు, కాలుష్యానికి దూరంగా ఉన్న ఆకాశం స్పష్టంగా ఉన్న ప్రదేశాలు.. వీటిని చూడటానికి అత్యంత అనుకూలం. రాత్రి వేళ ఆరుబయట మన కళ్లు చీకటికి పూర్తిస్థాయిలో అలవాటు పడటానికి కనీసం 20 నుండి 30 నిమిషాల సమయం పడుతుంది. మేఘాలు లేని నిర్మలమైన ఆకాశం ఉంటే, నవంబర్ 18 తెల్లవారుజామున ఆకాశంలో క్షణకాలం మెరిసి మాయం అయ్యే ఈ ఉల్కల విందును నేరుగా చూడొచ్చు.
మిగిలిన వాటి కంటే కూడా ఈ లియోనిడ్ ఉల్కాపాతం ప్రత్యేకం. ఫైర్ బాల్స్ సృష్టిస్తాయవి. కొన్ని సందర్భాల్లో అత్యంత అరుదైన ఉల్కా తుఫాన్ లను కూడా సృష్టించే ప్రత్యేకత వీటికి ఉంది. ఇతర తోకచుక్కలతో పోల్చుకుంటే టెంపెల్ టాటిల్ కు విడిచిపెట్టే శకలాలు చాలా ఎక్కువ. వీటి గుండా భూమి ప్రయాణించినప్పుడు గంటకు వేలాది ఉల్కలు వర్షంలా కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు. మెటియోర్ ఆర్గనైజేషన్ అంచనాల ప్రకారం రాబోయే 2031, 2033, 2034 సంవత్సరాల్లో ఇలాంటి భారీ ఉల్కా తుఫానులు మళ్లీ సంభవించే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
