US జాబ్ గ్రీన్ కార్డులపై కంపెనీలకు మరో షాక్..! తాజా రూల్స్ ప్రకటన..!
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు ఇచ్చే జాబ్ ఆధారిత గ్రీన్ కార్డుల (Green Card) విషయంలో ట్రంప్ సర్కార్ మరో షాకిచ్చింది. గ్రీన్ కార్డుల కోసం విదేశీ ఉద్యోగుల్ని స్పాన్సర్ చేసే కంపెనీలకు తాజాగా కఠిన నిబంధనలు విధించేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా జాబ్ గ్రీన్ కార్డుల జారీలో అమెరికన్లకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే విదేశీ నిపుణుల్ని స్పాన్సర్ చేయాలని కొత్త రూల్ పెట్టాలని ప్రతిపాదిస్తోంది. అదే జరిగితే ఇకపై విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డుల్ని స్పాన్సర్ చేయడం ఆయా కంపెనీలకు కష్టతరం కానుంది.
అమెరికా కంపెనీలు స్థానిక ఉద్యోగులకు గ్రీన్ కార్డుల్ని స్పాన్సర్ చేశాకే, విదేశీ ఉద్యోగులకు స్పాన్సర్ చేసేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోడర్లింగ్ వెల్లడించారు. ప్రపంచంలో అమెరికా ఉద్యోగులే అత్యుతమమని, అధిక నైపుణ్యం, అధిక వేతనాలు కలిగిన ఉద్యోగాల్లో ముందుగా వారికే మొదటి అవకాశం దక్కాలని పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే ముందు అర్హులైన అమెరికన్లకు అవకాశం కల్పించేలా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ ప్రతిపాదనల ప్రకారం చూస్తే దాదాపు 20 ఏళ్ల తర్వాత PERM విధానంలో అమెరికా ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతోంది.

ప్రస్తుతం ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల కింద గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులకు పెర్మ్ ప్రక్రియ చాలా కీలకం. ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల ప్రకారం విదేశీ ఉద్యోగిని శాశ్వతంగా నియమించుకునే ముందు , ఆ ఉద్యోగానికి తగిన అర్హతలున్న అమెరికా ఉద్యోగులు అందుబాటులో లేరని కంపెనీలు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే విదేశీ ఉద్యోగిని నియమించుకోవడం వల్ల అమెరికా ఉద్యోగుల వేతనాలు, పని పరిస్ధితులపై ప్రభావం లేకుండా చూసుకోవాలి. దీంతో పాటు కంపెనీలు ఉద్యోగ ప్రకటనల్ని తమ వెబ్ సైట్లు, ఆన్ లైన్ జాబ్ పోర్టల్స్, సోషల్ మీడియా వేదికల్లో ఇవ్వాలి. జాబ్ ఫెయిర్లు, క్యాంపస్ రిక్రూట్ మెంట్ల ద్వారా కూడా నియామకాలు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అమెరికా అభ్యర్ధుల్ని నిజాయితీగా పరిశీలించి, వారిని ఎంపిక చేయకపోతే సరైన కారణాలు చెప్పాలి. గత రెండేళ్లలో అమెరికా ఉద్యోగుల్ని కంపెనీలు తొలగిస్తే, వారి స్ధానంలో విదేశీ ఉద్యోగుల నియామకాలపై పరిమితులు ఎదుర్కోవాల్సిందే. ఇవాళ ఫెడరల్ రిజిస్టర్ లో ప్రచురణ తర్వాత 60 రోజుల్లో ప్రజల అభ్యంతరాలు, సూచనలు తీసుకుని అనంతరం వీటిని అమల్లోకి తెస్తారు.














Click it and Unblock the Notifications
