ఆకాశంలో అద్భుతం- డబుల్ బొనాంజా: కళ్ల ముందు తారాజువ్వల్లా రివ్వుమంటూ
డెల్టా అక్వారిడ్స్.. ఓ అద్భుత, అరుదైన ఉల్కాపాతం. లెక్కలేనన్ని ఉల్కాపాతాలు కళ్ల ముందు రాకెట్లల్లా రివ్వుమంటూ దూసుకెళ్తాయి. క్షణాల్లో మటుమాయమౌతాయి. చీకటి నిండిన అనంత ఆకాశం దీపావళి మతాబులా వెలిగిపోతుందా క్షణంలో దీన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఒక్క ఉల్కాపాతమే ఇలాంటి అనుభూతిని పంచితే.. అదే జంటగా కలిసివస్తే ఎలా ఉంటుంది?. ఆ అరుదైన క్షణాలు రానే వచ్చాయి.
ఈ నెల 30, 31 తేదీల్లో.. అంటే గురు, శుక్రవారాల్లో రాత్రివేళ నిశ్శబ్దాకాశంలో డబుల్ ఈ ఉల్కాపాతం కనువిందు చేయబోతోంది. ఈ రెండూ.. సదరన్ డెల్టా అక్వారిడ్స్, ఆల్ఫా క్యాప్రికార్నిడ్స్. ఈ రెండు ఉల్కాపాతాలు ఒకేసారి ఆకాశంలో కాంతి రేఖలను కురిపించబోతోన్నాయి. రాత్రి మొదలుకుని తెల్లవారుజాము వరకు గరిష్ట స్థాయికి చేరుకోనున్నాయి. ఈ అందమైన దృశ్యాన్ని కళ్లారా వీక్షించాలనుకునే నక్షత్ర ప్రేమికులకు చంద్రుడి వెలుగులు ఓ సవాల్ గా మారింది.

ఈ నెల 29న ఏర్పడే పౌర్ణమి కారణంగా.. మరుసటి రోజు రాత్రి కూడా చంద్రబింబం దాదాపు 98 శాతం నిండుగా ప్రకాశిస్తుంది. ఈ వెన్నెల వెలుతురు వల్ల ఆకాశంలో కురిసే ఈ నక్షత్ర రంగు పూల వర్షం, క్షణాల్లో మటుమాయం అయ్యే వాటి బలహీన కాంతి రేఖలు కంటికి కనిపించకుండా పోయే అవకాశం ఉంది.
సాధారణంగా సదరన్ డెల్టా అక్వారిడ్స్ ఉల్కాపాతం ప్రతి సంవత్సరం జూలై 12 నుంచి ఆగస్టు 23 వరకు చాలా యాక్టివ్ గా ఉంటుంది. జూలై 30, 31 రాత్రి వేళల్లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. గంటకు ఎంత లేదన్నా కనీసం 25 ఉల్కలు రాలిపడే అవకాశం ఉంటుంది. ఈ దఫా మాత్రం పున్నమి చంద్రుడి వెలుతురు వల్ల వీటిని స్పష్టంగా చూడడం కష్టమే. అదే సమయంలో ఈ నెల 3న ఆరంభమైన ఆల్ఫా క్యాప్రికార్నిడ్స్ ఉల్కాపాతం ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగుతుంది. గంటకు అయిదు ఉల్కలు మాత్రమే కనిపిస్తాయి.
సరిగ్గా ఇక్కడే ఆల్ఫా క్యాప్రికార్నిడ్స్ ప్రత్యేకత బయటపడుతుంది. ఇవి సంఖ్యలో తక్కువగా ఉన్నప్పటికీ.. అత్యంత కాంతివంతమైన ఫైర్‌బాల్స్ ను సృష్టిస్తాయి. అంతరిక్ష శిలలు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు పెరిగే రాపిడి వల్ల ఇవి పెద్ద ఎత్తున మండిపోతాయి. ఈ క్రమంలో అవి రంగురంగుల వెలుగులను చిమ్ముతూ ప్రయాణిస్తాయి. నిండు చందమామ ఉన్నప్పటికీ కూడా ఈ ఫైర్‌బాల్స్ మాత్రం ఆకాశంలో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
ఈ నక్షత్రాల వర్షాన్ని వీక్షించడానికి అర్ధరాత్రి దాటిన సమయం నుంచి తెల్లవారుజాము వరకు అత్యంత అనుకూలం. ఈ సమయంలో కుంభ రాశి ఆకాశంలో గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది. ఈ అద్భుతాన్ని కంటితో చూడాలనుకునే వారు వీలైనంత వరకు ఎత్తయిన ప్రదేశాలను ఎంచుకోవడం అవసరం. చంద్రుడి వెలుతురు గానీ, విద్యుత్ కాంతులు గానీ నేరుగా కంటిపై పడకుండా ఉండే చీకటి ప్రదేశం నుంచి ఈ మెటియోర్ మెరుపులను వీక్షించవచ్చు.












Click it and Unblock the Notifications