రెండేళ్లు ఆయనకు.. మరో రెండేళ్లు నెతన్యాహుకు! ఇజ్రాయెల్‌లో కొత్త పవర్ షేరింగ్ ఫార్ములా!
ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన తొలగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత ఐక్య ప్రభుత్వంలో రొటేషన్ ఒప్పందం ప్రకారం రెండేళ్ల తర్వాత ప్రధాని పదవి చేపట్టేందుకు బెంజమిన్ నెతన్యాహు అంగీకరించే అవకాశం ఉందని సమాచారం. ముందుగా గాడీ ఐజెన్‌కోట్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత నెతన్యాహు ప్రధానిగా వ్యవహరించేలా సమీకరణలు చర్చకు వచ్చాయి. ఇప్పటివరకు ఈ ప్రతిపాదనను నెతన్యాహు తోసిపుచ్చుతూ వచ్చినప్పటికీ.. తాజాగా తన పట్టు వీడినట్లు సమాచారం.
రొటేషన్ ఫార్ములాపై కీలక మలుపు
ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా నిలిచిన గాడీ ఐజెన్‌కోట్ నేతృత్వంలోని 'యషర్' పార్టీ, నెతన్యాహుకు చెందిన 'లికుడ్' పార్టీల మధ్య ఐక్య ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు సాగుతున్నాయి. తొలుత రెండేళ్ల పాటు ప్రధాని పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ప్రతిష్టంభన నెలకొనగా, ఇద్దరూ ముందుగా ప్రధాని కావాలని పట్టుబట్టారు. అయితే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. రొటేషన్ పద్దతిలో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అంశాన్ని నెతన్యాహు పరిశీలిస్తున్నారు. ఇజ్రాయెల్ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించే అవకాశం ఉందని, శని లేదా ఆదివారాల్లో ఈ ప్రకటన రావచ్చని నివేదిక పేర్కొంది.

తమ ప్రతిపాదిత ఫ్రేమ్‌వర్క్ కింద ఐక్య ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో లికుడ్ పార్టీ పెద్దగా ఆసక్తి చూపలేదని ఐజెన్‌కోట్ పేర్కొన్నారు. గత రెండు వారాల్లో ఐదు సమావేశాలు జరిగినా, నిజమైన సంకల్పం ఉంటే ఒప్పందానికి ఇది సరిపడా సమయమని అన్నారు. సీట్లు లేదా ముందుగా ప్రధాని ఎవరనే దానికంటే ప్రధాన సమస్యలు, విలువలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ లెక్కలు
అక్టోబర్ 27న జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఐక్య ప్రభుత్వ ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో యషర్, లికుడ్ బృందాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 2 (బుధవారం) నాటికి కూటమి ఒప్పందాలను ఖరారు చేసి, వాటిపై సంతకాలు చేసి, నెస్సెట్ (పార్లమెంట్)కు సమర్పించాలని ఐజెన్‌కోట్ వర్గం ప్రణాళిక వేస్తోంది. అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ఇచ్చిన గడువు ప్రకారం కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు పూర్తి చేసేందుకు వారం కంటే తక్కువ సమయమే ఉంది. లికుడ్ పార్టీ తన వైఖరిని మార్చుకుని సాహసోపేత నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైతే తలుపులు తెరిచే ఉన్నాయని ఐజెన్‌కోట్ పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలు.. ప్రతిష్టంభన నేపథ్యం
అక్టోబర్ 27 ఎన్నికల్లో నెతన్యాహు మెజారిటీని కోల్పోగా, ఐజెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి కూడా మెజారిటీ మార్కును అందుకోలేకపోయింది. దీంతో అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఐజెన్‌కోట్‌ను ఆహ్వానించారు; నెతన్యాహు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్ లో మొత్తం 120 సీట్లు కాగా.. మెజారిటీకీ అవసరమైన నీట్లు 61 కావడం గమనార్హం. ఎన్నికల్లో నెతన్యాహు కూటమికి 53 సీట్లు రాగా.. ఐజెన్కోట్ కూటమికి 48 సీట్లు వచ్చాయి. ఈ కూటమికి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఇరు ప్రధాన కూటములు మెజారిటీకి దూరంగా నిలవడంతో, ఇద్దరు నేతలు కలిసి చెరో రెండేళ్ల చొప్పున ప్రధానిగా బాధ్యతలు పంచుకునే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.














Click it and Unblock the Notifications
