ఎన్టీఆర్–అనిల్ రావిపూడి కాంబో వెనుక పెద్ద ప్లాన్! టాలీవుడ్‌కు గేమ్ ఛేంజర్?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. భారీ బడ్జెట్లు, విజువల్ ఎఫెక్ట్స్, వివిధ భాషల్లో రిలీజులు, అంతర్జాతీయ స్థాయి ప్రమోషన్లతో తెలుగు సినిమా తన పరిధిని విస్తరించుకుంటోంది. అయితే ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సంప్రదాయ కమర్షియల్ వినోదానికి కొంత ప్రాధాన్యత తగ్గుతోందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. ఈ కాంబినేషన్ కేవలం మరో స్టార్ హీరో సినిమా మాత్రమేనా? లేక తెలుగు సినిమా శైలిలో కొత్త మార్పుకు నాంది పలుకుతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విమర్శలను దాటుకుని తనదైన ముద్ర వేసిన అనిల్ రావిపూడి
డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వినోదానికి పెద్దపీట వేస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కథలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఖ్యంగా కామెడీ, కమర్షియల్ అంశాలను మేళవించి ప్రేక్షకులను నవ్వించడంలో అనిల్ రావిపూడికి మంచి పట్టు ఉంది. వరుస విజయాలతో టాలీవుడ్‌లో అగ్ర కమర్షియల్ డైరెక్టర్ల జాబితాలో స్థానం సంపాదించారు. అయితే అనిల్ రావిపూడి సినిమాలపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. కానీ ఓ డైరెక్టర్ ప్రతిభను కేవలం ఒకే తరహా సినిమాల ఆధారంగా అంచనా వేయలేమని ఆయన కెరీర్లోని కొన్ని సినిమాలు స్పష్టం చేస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కించిన 'భగవంత్ కేసరి' ఇందుకు మంచి ఉదాహరణగా నిలిచింది. తనకు అలవాటైన వినోదాత్మక కథనానికి భిన్నంగా, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, మహిళా సాధికారత వంటి అంశాలను మేళవించి ఈ సినిమాను రూపొందించారు. బాలకృష్ణ పాత్రను విభిన్నంగా తీర్చిదిద్దడంతో పాటు, కథలోని భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో అనిల్ రావిపూడి కేవలం కామెడీ, కమర్షియల్ సినిమాలకే పరిమితమైన దర్శకుడు కాదనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
పాన్ ఇండియా ట్రెండ్‌లో ప్రాంతీయ సినిమాకు తగ్గిన ప్రాధాన్యత?
గత ఐదేళ్లలో తెలుగు సినిమా ప్రయాణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 'బాహుబలి'తో మొదలైన పాన్ ఇండియా ప్రభావం, ఆ తర్వాత 'పుష్ప', 'ఆర్ఆర్ఆర్', 'కల్కి 2898 ఏడీ' వంటి చిత్రాలతో మరింత విస్తరించింది. తెలుగు సినిమా కథలు ఇతర భాషల ప్రేక్షకులకు చేరువ కావడం పరిశ్రమకు కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది. ఈ పరిణామం నిస్సందేహంగా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచింది. అయితే మరోవైపు ప్రతి సినిమాను జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఆలోచనతో కథలు, పాత్రలు, కథనాల రూపకల్పనలో మార్పులు వస్తున్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. స్థానిక సంస్కృతి, తెలుగు నేటివిటీ, కుటుంబ అనుబంధాలు, మనదైన హాస్యం వంటి అంశాలకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చే కథలు కొంత అరుదవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకప్పుడు 'అల వైకుంఠపురములో', 'అదుర్స్', 'మిర్చి' వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాల్లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ లేదా అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకున్న కథనాల కంటే, బలమైన పాత్రలు, వినోదం, భావోద్వేగాలు, తెలుగు ప్రేక్షకులకు నచ్చే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు అందించిన వినోదం ప్రత్యేకమైనది. కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమా చూసి హాయిగా నవ్వుకుంటూ బయటకు రావాలనే అనుభూతిని ఇవి అందించాయి. అందుకే ప్రాంతీయ కమర్షియల్ సినిమాలకు మళ్లీ ప్రాధాన్యత పెరగాలనే ఆకాంక్ష సినీ అభిమానుల్లో కనిపిస్తోంది.
ఎన్టీఆర్‌తో అనిల్ రావిపూడికి అరుదైన అవకాశం
ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం అనిల్ రావిపూడికి ఓ కీలక మలుపుగా మారవచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌కు మాస్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, నటనలోని వైవిధ్యం, కామెడీ టైమింగ్, భావోద్వేగాలను పలికించే సామర్థ్యం తెలిసిందే. మరోవైపు అనిల్ రావిపూడికి కమర్షియల్ అంశాలను ప్రేక్షకులకు చేరువ చేయడంలో మంచి అనుభవం ఉంది. ఈ రెండు బలాలు ఒకే ప్రాజెక్ట్‌లో కలిస్తే ప్రేక్షకులకు ఆసక్తికరమైన వినోదం అందించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను కొత్త తరహా పాత్రలో చూపించడంతో పాటు, ఆయన అభిమానులు ఆశించే మాస్ అంశాలు, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదం, బలమైన భావోద్వేగాలను సమతూకంగా మేళవించగలిగితే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచే అవకాశముంది. అయితే ఈ ప్రాజెక్ట్ విజయంలో స్టోరీ, క్యారెక్టర్ల రూపకల్పన, మ్యూజిక్, స్క్రీన్‌ప్లే, సాంకేతిక నాణ్యత కీలక పాత్ర పోషించనున్నాయి. కేవలం స్టార్ హీరో, విజయవంతమైన దర్శకుడి కలయిక మాత్రమే సినిమాను విజయతీరాలకు చేర్చలేదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.
హిట్ అయితే టాలీవుడ్‌లో మార్పులకు నాంది?
ఎన్టీఆర్-అనిల్ రావిపూడి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తే, పరిశ్రమలో కొత్త చర్చకు దారితీయవచ్చు. ముఖ్యంగా తెలుగు నేటివిటీ, స్థానిక ప్రేక్షకుల అభిరుచులు, సంప్రదాయ కమర్షియల్ వినోదానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాలు రూపొందించేందుకు దర్శకనిర్మాతలు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమాలు చేయకూడదనే అర్థం ఇందులో లేదు. తెలుగు సినిమా మార్కెట్‌ను విస్తరించడంతో పాటు, మన ప్రేక్షకులకు నచ్చే కథలను కూడా సమానంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ఈ చర్చలో ప్రధానంగా కనిపిస్తోంది.
అనిల్ రావిపూడి నుంచి ఎలాంటి సినిమా ఆశించవచ్చు?
అనిల్ రావిపూడి ఇప్పటివరకు సాధించిన విజయాలు ఆయనకు ప్రేక్షకుల అభిరుచిపై ఉన్న అవగాహనను తెలియజేస్తాయి. ఏ స్టోరీలో ఏ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో, ఎక్కడ వినోదం ఉండాలో, ఎక్కడ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలో ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందని ఆయన సినిమాలు సూచిస్తున్నాయి ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు కథ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అభిమానుల అంచనాలు, సాధారణ ప్రేక్షకుల అభిరుచులు, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ.. ఇలా అన్ని అంశాలను సమన్వయం చేయడం సవాలుతో కూడుకున్న పని.'భగవంత్ కేసరి'తో తనలోని మరో కోణాన్ని చూపించిన అనిల్ రావిపూడి, ఎన్టీఆర్‌తో ఎలాంటి కథను ఎంచుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ నటనకు తగిన పాత్ర, అనిల్ మార్క్ వినోదం, తెలుగు నేటివిటీ కలిస్తే ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించవచ్చు.
గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందా?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పాన్ ఇండియా మార్కెట్ ఎంత ముఖ్యమో, ప్రాంతీయ ప్రేక్షకుల ఆదరణ కూడా అంతే ముఖ్యం. ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో మనదైన కథన శైలి, తెలుగు నేటివిటీ, స్థానిక వినోదాన్ని విస్మరించకూడదనే అభిప్రాయం బలపడుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్-అనిల్ రావిపూడి కాంబినేషన్ ఓ ఆసక్తికరమైన ప్రయోగంగా నిలవవచ్చు. ఈ చిత్రం విజయం సాధిస్తే ప్రాంతీయ కమర్షియల్ చిత్రాలకు మళ్లీ ప్రాధాన్యత పెరగడమే కాకుండా, తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు రూపొందించేందుకు దర్శకనిర్మాతలకు కొత్త ఉత్సాహం లభించవచ్చు.














Click it and Unblock the Notifications
