జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
మొబైల్ రీఛార్జ్ కోసం యాప్ లేదా వెబ్‌సైట్ తెరిచినప్పుడు వినియోగదారులకు ఏ ప్లాన్లు ముందుగా కనిపించాలనే అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్), ప్రముఖ టెలికాం సంస్థల మధ్య వివాదం రాజుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూపొందించిన చౌక రీఛార్జ్ ప్లాన్లను యాప్స్, వెబ్‌సైట్లలో ముందుగా చూపించాలని ట్రాయ్ ఆదేశించగా.. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు అందుకు ఇష్టపడటం లేదని సమాచారం.
వివాదానికి అసలు కారణమేంటి?
ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్ కోసం తక్కువ ధర రీఛార్ద్ కోరుకునే వినియోగదారులకు యాప్‌లలో సరైన ప్లాన్ సులభంగా కనిపించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, ఓటీటీ సదుపాయాలతో కూడిన ఖరీదైన ప్లాన్ల వైపే కస్టమర్లను ఆకర్షించేలా యాప్ డిజైన్లు ఉంటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అక్టోబర్ 1, 2026న ట్రాయ్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అన్ని టెలికాం సంస్థలు తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ విభాగంలో 'TRAI-Mandated Packs' పేరుతో ప్రత్యేకమైన, స్పష్టంగా కనిపించే ట్యాబ్ ఏర్పాటు చేయాలి. వెబ్‌సైట్, మొబైల్ యాప్ రీఛార్జ్ విభాగంలో ఇది మొదటి స్థానంలో ఉండాలని.. 30 రోజుల్లోగా నిబంధనలు అమలు చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

కంపెనీల వాదన ఏమిటంటే?
చౌక ప్లాన్లు తమ యాప్స్, వెబ్ సైట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని.. వాటిని తప్పనిసరిగా ముందుగా చూపించాల్సిన అవసరం ఏమిటని కంపెనీలు ప్రశ్నిస్తున్నాయి. జియో అధికారులు తాము నిబంధనలు పాటిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. జియో, ఎయిర్‌టెల్ యాప్స్‌లో ఇవి మొదటి ట్యాబ్‌లో కనిపించడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు వోడాఫోన్ ఐడియా మాత్రం మొదటి ట్యాబ్‌లోనే వీటికి చోటు కల్పించింది.
ఏఆర్పీయూ ఆందోళన.. విశ్లేషకుల అంచనా
ఈ వ్యవహారంలో కీలకమైన అంశం ఏఆర్పీయూ (ARPU- Average Revenue Per Over). డేటా ప్యాకులతో కూడిన ఖరీదైన రీఛార్జులు తీసుకుంటే కంపెనీకి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అదే కస్టమర్ తక్కువ ధర వాయిస్-ఓన్లీ ప్లాన్‌కు మారితే ఏఆర్పీయూ తగ్గే అవకాశం ఉంటుంది. చౌక ప్లాన్లను ముందుగా చూపిస్తే కస్టమర్లు వాటి వైపు మొగ్గు చూపి.. తమ ఆదాయంపై ప్రభావం పడుతుందని జియో, ఎయిర్‌టెల్ ఆందోళన చెందుతున్నాయి. అయితే యాక్సిస్ క్యాపిటల్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. వినియోగదారులు చౌక ప్లాన్ల వైపు మళ్లినా ఎయిర్‌టెల్ మొబైల్ ఆదాయంపై గరిష్టంగా ఒక్క శాతం కంటే తక్కువ ప్రభావం.. వోడాఫోన్ ఐడియాపై దాదాపు 2.3 శాతం వరకు ప్రభావం ఉండొచ్చు.
వినియోగదారులకు కలిగే ప్రయోజనమేంటి?
ట్రాయ్ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలైతే రీఛార్జ్ యాప్ తెరవగానే తక్కువ ధర ప్లాన్లు ఒకే చోట సులభంగా లభిస్తాయి. వివిధ కేటగిరీల మధ్య వెతుకుతూ సమయం వృథా చేయాల్సిన అవసరం తప్పుతుంది. ప్రస్తుతం నిబంధనల అమలు, కంపెనీల స్పందన, ట్రాయ్ తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.













Click it and Unblock the Notifications
