ఏపీలో ఓఎన్‌జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీక్: చదరపు కిలోమీటర్ పరిధి ఖాళీ: ఘాటు వాసన
కోనసీమ జిల్లాలో ఈ తెల్లవారుజామున భారీ గ్యాస్ లీకేజీ ఉదంతం చోటుచేసుకుంది. రాజోలు నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని తాడివారి మెరక ప్రాంతంలో ఉన్న ఓఎన్జీసీ రీడ్రిల్లింగ్ బావి నుంచి ఒక్కసారిగా హైప్రెషర్ తో కూడిన గ్యాస్ లీక్ అయింది. ఈ ఆకస్మిక పరిణామంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన జిల్లా యంత్రాంగం, ప్రాణనష్టం జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది.
గతంలో మూసివేసి ఉంచిన ఈ బావిలో ఓఎన్జీసీ ఇటీవల రీడ్రిల్లింగ్ పనులు ప్రారంభించింది. ఈ తెల్లవారుజామున పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ బయటకు ఎగజిమ్మింది. దీనికి ఈదురుగాలులు తోడు కావడంతో ఈ గ్యాస్ క్షణాల్లో విస్తరించింది. గ్యాస్ వాసన తీవ్రం కావడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఊపిరి పీల్చడంలో ఇబ్బందులకు గురయ్యారు. ఘాటువాసన పరిసర ప్రాంతాలను ఆవరించింది.

సమాచారం అందుకున్న వెంటనే ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు, జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. ఈ గ్యాస్ లీకేజీని అరికట్టడానికి ఓఎన్జీసీ అధికారులు నర్సాపురం నుంచి ప్రత్యేక బ్లోఅవుట్ కంట్రోల్ బృందాన్ని రప్పించారు. ఈ బావికి మంటలు అంటుకోకుండా ఉండటానికి అగ్నిమాపక సిబ్బందిని భారీగా మోహరించారు. నిప్పు రవ్వలు చెలరేగితే భారీ అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున, ముందుజాగ్రత్తగా బావి చుట్టూ వాటర్ అంబ్రెల్లాను ఏర్పాటు చేశారు.
ఈ విధానం ద్వారా గ్యాస్ వ్యాపిస్తున్న ప్రాంతంలో నిరంతరం నీటిని పిచికారీ చేస్తూ మంటలు చెలరేగకుండా అడ్డుకుంటున్నారు. బావి చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బావి నుంచి ఒక చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. జాతీయ రహదారి 216 బైపాస్ మార్గంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించారు.
ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్థానిక ప్రజలు ఇళ్లలో వంట గ్యాస్ స్టవ్ లేదా ఎలాంటి నిప్పు సంబంధిత వస్తువులను వెలిగించవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఓఎన్జీసీ నిపుణులు, బ్లోఅవుట్ కంట్రోల్ టీమ్స్ పరిస్థితిని పూర్తిగా తమ అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తోన్నాయి. జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తోన్నారు. గ్యాస్ లీకేజీ సంపూర్ణంగా నిలిచిపోయి, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించారు. ఒఎన్‌జీసీ చైర్మన్, సంస్థ సీనియర్ అధికారులతో మాట్లాడారు. లీకేజీని అదుపు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఉన్నతాధికారులను అడిగి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. స్థానిక ప్రజల ప్రాణ భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాద ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.














Click it and Unblock the Notifications
