తిరుమలలో టన్నుల కొద్దీ పువ్వులతో..: అదే హైలైట్
తిరుమల.. సప్తవర్ష శోభితమైంది. శ్రీవారికి నిర్వహించిన పుష్పార్చనతో తిరుమలకొండ పులకించింది. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వైభవం మరింత ఇనుమడించింది. టన్నుల్లో తీసుకొచ్చిన అనేక రకాలు పువ్వులు.. స్వామివారిని ముంచెత్తాయి. భక్తిపారవశ్యం ప్రవహించింది శేషగిరుల్లో. పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలను అర్చించడం హైలైట్.
పవిత్ర కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు టీటీడీ అర్చకులు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి, అమ్మవార్ల వెలిగిపోయారు. వారి వైభవం మరింత ఇనుమడించింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా దోషాలు జరిగి ఉంటే దాన్ని నివారించడానికి కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహించినట్లు చరిత్ర చెబెతోంది. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి టీటీడీ పునరుద్ధరించింది. అప్పటి నుంచి ఏటేటా క్రమం తప్పకుండా దీన్ని నిర్వహిస్తూ వస్తోంది.
మొదట తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ సాధికారిక మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు.
అనంతరం మలయప్ప స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రాలు, భరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లె, మొల్లలు, కనకాంబరం, తామర, మాను సంపంగి వంటి అనేక రకాల పుష్పాలతో పాటు తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో స్వామి, అమ్మవార్లను అర్చించారు. ఈ సందర్భంగా వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు.
పుష్పాలకు అధిపతి అయిన దేవుడు పుల్లుడిని ఆవాహన చేసి 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్చించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్ప నివేదన చేపట్టారు. పుష్పయాగానికి మొత్తం తొమ్మిది టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. ఈ పుష్పయాగం కోసం దాతల నుంచి పుష్పాలు సేకరించడానికి కృషి చేసిన టీటీడీ ఉద్యానవన విభాగం అధికారులను ముద్దాడ రవిచంద్ర, వెంకయ్య చౌదరి సన్మానించారు.














Click it and Unblock the Notifications
