రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద వైమానిక దాడి.. 1,300 కుపైగా డ్రోన్లతో విధ్వంసం..
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య నాలుగేళ్లుగా యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద వైమానిక దాడిని చేపట్టింది. 1,336 డ్రోన్ లతో రష్యాపై విరుచుకుపడింది. ఈ దాడికి సంబంధించిన వివరాలను రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ తాజాగా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద వైమానిక దాడి ఇదేనని పేర్కొంది. రష్యా బలగాలు ఒక్కరాత్రిలోనే ఏకంగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన 1,336 డ్రోన్ లను కూల్చేసినట్లు స్పష్టం చేసింది. ఆదివారం అర్ధరాత్రి.. సోమవారం ఉదయం ఈ దాడులు జరిగినట్లు పేర్కొంది.
ఇక ఈ దాడిపై రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మాట్లాడారు. ఇవి మాస్సీవ్ దాడులుగా అభివర్ణించారు. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిరంతరం చేపట్టిన కృషి కారణంగా ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్ లను కూల్చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఇలాంటి దాడులను 100 శాతం ఎదుర్కోవడం ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇక వచ్చేవారం చైనాలోని షెంజెన్ నగరంలో ఆసియా- పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ జరగనుంది. ఈ సమ్మిట్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడి చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇక రష్యా రాజధాని మాస్కో టార్గెట్ గా ఉక్రెయిన్ దాడులు చేపట్టినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ టెలిగ్రామ్ ద్వారా తెలిపారు. రష్యా లక్ష్యంగా దాదాపు 600 డ్రోన్ దాడులు జరిగాయన్నారు. అయితే వాటిలో చాలా డ్రోన్స్ ను రాజధాని వెలుపలే కూల్చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే రష్యాలోని భారీ ఆయిల్ రీఫైనరీలు ఉన్న రోస్తోవ్, క్రాస్ నోడార్ క్రాయ్ ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇక రోస్తోవ్ రీజినల్ గవర్నర్ యూరి స్లూసార్.. అజోవ్ ప్రాంతంలో ముగ్గురు గాయపడినట్లు స్పష్టం చేశారు.

అలాగే అజోవ్ ప్రాంతంలోని నాలుగు పరిశ్రమలు కూడా దగ్ధమైనట్లు పేర్కొన్నారు. అలాగే క్రాస్నోడార్ ప్రాంతంలో డ్రోన్ శకలాలు మీద పడి మరో ఆరుగురికి గాయాలైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో దాదాపు 19 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన టార్గెట్ గా దాడులు జరిగినట్లు సమాచారం. ఇక ఓవైపు అబుదాబి వేదికగా జరుగుతున్న శాంతి చర్చల నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications
