రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్ ఇవ్వబోతున్న యశస్వి జైస్వాల్!
IPL 2027: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందు ట్రేడ్ విండోలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్ జట్టును వీడనన్నారన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారాయి. తాజాగా ఈ అంశంపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైస్వాల్ సంతోషంగా లేదని.. త్వరలోనే ఆయన మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరే అవకాశం ఉందని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు.
కెప్టెన్సీ వివాదమే అసలు కారణమా?
ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. "నేను విన్న, చూసిన సమాచారం ప్రకారం యశస్వి జైస్వాల్ రాజస్థాన్ జట్టులో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం కెప్టెన్సీ కావచ్చు. రెండు సీజన్ల క్రితం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావడం, ఆ తర్వాత జట్టు పగ్గాలను రియాన్ పరాగ్‌కు అప్పగించడం యశస్వి జైస్వాల్ కు మింగుడుపడలేదని అనిపిస్తోంది. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఏదైనా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. అందుకు లక్నో లేదా కోల్‌కతా జట్లు ఆయనకు సరైన వేదిక కాగలవు" అని ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించారు.

వరుణ్ చక్రవర్తితో భారీ ట్రేడ్ డీల్?
అజింక్య రహానే రిటైర్మెంట్ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు నడిపించగల కెప్టెన్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ ఓ ఇంట్రెస్టింగ్ ట్రేడ్ డీల్ ను సూచించారు. యశస్వి జైస్వాల్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు వెళ్లి.. ఆయనకు బదులుగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వస్తే ఇరు జట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.
"వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలర్, కేకేఆర్ కోసం ఎంతో చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేకేఆర్ కు భవిష్యత్ నాయకుడు అత్యవసరం. వరుణ్ చక్రవర్తిని వదులుకుని యశస్వి జైస్వాల్ లాంటి కెప్టెన్‌ను తీసుకుంటే అది తెలివైన నిర్ణయమవుతుంది" అని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ఒకవేళ ఈ బంపర్ ట్రేడ్ డీల్ ఖరారైతే.. కేకేఆర్ జట్టులో ఓపెనర్లుగా ఫిన్ అలెన్, యశస్వీ జైస్వాల్ విధ్వంసకర జోడీ సిద్ధమవుతుంది. గతంలో శుభ్‌మన్ గిల్ ను వదులుకున్న తర్వాత కేకేఆర్ వెతుకుతున్నభారత సూపర్ స్టార్ లోటు కూడా యశస్వి జైస్వాల్ రాకతో తీరనుంది.














Click it and Unblock the Notifications
