ఇళ్ల పథకాల లబ్దిదారులకు రేవంత్ గుడ్ న్యూస్-7 లక్షల మంది తనఖా పట్టాలు వెనక్కి..!
తెలంగాణలో 7 లక్షల మంది ఇళ్ల పథకాల లబ్దిదారులకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Govt) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ లబ్దిదారులు గతంలో వివిధ కారణాలతో తనఖా పెట్టిన ఇళ్ల పట్టాల్ని, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇవాళ కీలక ప్రకటన చేశారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ఇళ్ల పథకాల లబ్దిదారులు తమ ఇళ్ల పట్టాల్ని, పొజిషన్ సర్ఠిఫికెట్లను తనఖా పెట్టారు. వీటిని వారికి తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గృహనిర్మాణ పథకంలో ప్రభుత్వ రాయితీ, లబ్దిదారుల వాటా, బ్యాంకు రుణం ద్వారా నిధులు సమకూర్చే విధానం ఉండేది. దీంతో రుణాల కోసం ఆయా పథకాల లబ్దిదారులు తమ పట్టాలని తాకట్టు పెట్టేవారు. వారు తీసుకున్న రుణం మొత్తం చెల్లించాక పట్టాలు తిరిగి ఇచ్చే వారు.

అయితే ఇలా ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు తీసుకున్న వారు వివిధ కారణాలతో చెల్లించకపోవడంతో వారి పట్టాలు, పొజిషన్ సర్ఠిఫికెట్లు తహసీల్దార్ కార్యాలయాల్లో ఉండిపోయాయి. తాజాగా ప్రభుత్వం 22ఏ భూములపై సమీక్ష చేసినప్పుడు ఈ వివాదం తెరపైకి వచ్చింది. దీంతో ఈ పట్టాలను తిరిగి లబ్దిదారులకు ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయా ఇళ్ల నిర్మాణ పథకాల లబ్దిదారులు తాకట్టు పెట్టిన పట్టాల్ని, పొజిషన్ సర్టిఫికెట్లను వారికి తిరిగి ఇచ్చేయాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల లబ్దిదారులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.














Click it and Unblock the Notifications
