Electric Cycle: ఒక్క ఛార్జింగ్‌తో 209 కిలోమీటర్లు.. అదిరిపోయే ఎలక్ట్రిక్ సైకిల్!
Electric Cycle: ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ప్రముఖ ఈ-బైక్ తయారీ సంస్థ 'మోనార్క్' తాజాగా తన కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ 'మోనార్క్ ట్రేసర్'ను మార్కెట్లోకి విడుదల చేసింది. డ్యూయల్ బ్యాటరీ సెటప్‌తో వస్తున్న ఈ సైకిల్.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 209 కిలోమీటర్ల(130 మైళ్లు) సుదీర్ఘ రేంజ్‌ను అందిస్తుండటం విశేషం. తక్కువ దూర ప్రయాణాలకు కారుకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొంగించినట్లు కంపెనీ పేర్కొంది.
డ్యూయల్ బ్యాటరీ ప్యాక్.. 209 కిలోమీటర్ల రేంజ్
సాధారణంగా ఈ-బైకులలో ఒకే బ్యాటరీ ఉంటుంది. కానీ మోనార్క్ ట్రేసర్‌లో రిమూవబుల్ 48V, 15AH(720Wh) సామర్థ్యం గల రెండు ఎల్జీ-సెల్ బ్యాటరీ ప్యాకులను అందించారు. ఒక్కో బ్యాటరీ సుమారు 104 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రెండు బ్యాటరీలు కలిపి 209 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వీలు కల్పిస్తాయి. దీనివల్ల తరచూ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. దీనితో పాటు 48V, 5A ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తున్నారు. బ్యాటరీ లైఫ్‌ను పెంచడానికి గరిష్ట ఛార్జ్ శాతాన్ని సెట్ చేసుకునే స్మార్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఇందులో ఉంది.

శక్తివంతమైన మోటార్, టాప్ స్పీడ్
ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌లో 720W బఫాంగ్ రియర్ హబ్ మోటార్‌ను అమర్చారు. ఇది 30-యాంపియర్ కంట్రోలర్‌తో కలిసి 1,638W పీక్ పవర్, 85Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఎత్తైన ప్రాంతాలు, కఠినమైన దారుల్లోనూ సులభంగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు.
డిజైన్, సస్పెన్షన్ ప్రత్యేకతలు
నిటారుగా కూర్చుని నడిపే రైడింగ్ పొజిషన్ వల్ల అలసట తగ్గడమే కాకుండా ట్రాఫిక్‌లో రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. స్టెప్-త్రూ-మోడల్‌ను 5 అడుగుల 2 అంగుళాల నుంచి 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు ఉన్నవారు సౌకర్యవంతంగా నడపవచ్చు. ఇది 150 కిలోల రైడర్ బరువుతో పాటు మొత్తం 191 కిలోల లోడ్‌ను మోయగలదు. గతుకుల రోడ్లపై సాఫీ ప్రయాణం కోసం 80mm సస్పెన్షన్ ఫోర్క్, 27.5 x 2.2- అంగుళాల వెడల్పు గల టైర్లను అమర్చారు.
రంగులు, ధర వివరాలు
మోనార్క్ ట్రేసర్ ఎలక్ట్రిక్ సైకిల్ హై-స్టెప్, స్టెప్-త్రూ అనే రెండు ఫ్రేమ్ డిజైన్లలో, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో(టాకోనైట్, సుపీరియర్, బిర్చ్‌వుడ్, జూన్‌బెర్రీ) లభిస్తుంది. డ్యూయల్ బ్యాటరీ వేరియంట్ ప్రారంభ ధరను 1,899 డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.1.78 లక్షలు) గా నిర్ణయించారు. బ్యాటరీ లేని బేస్ వేరియంట్ ధర 1,399 డాలర్లు(దాదాపు రూ.1.31 లక్షలు)గా ఉంది.














Click it and Unblock the Notifications
