అల్లం పచ్చి కారంతో వంకాయ కూర.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్!
మనకు వంకాయ కూరలతో ఉండే అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. కూరగాయలలో రారాజు వంకాయ. అలాంటి వంకాయ కూర రకరకాలుగా వండుకోవచ్చు. అయితే ఘాటైన అల్లం, పచ్చి కారంతో తయారయ్యే "అల్లం వంకాయ కూర" రుచే వేరు. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి ఈ కూర అద్భుతమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది. ఇంట్లో కూరగాయలు ఏమున్నాయా అని ఆలోచించే పనిలేకుండా, తక్కువ పదార్థాలతో ఎంతో రుచికరంగా ఈ వంటకాన్ని సిద్ధం చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
వంకాయలు - అర కిలో (ముక్కలు కట్ చేసుకోవాలి)
అల్లం - 20 గ్రాముల ముక్క
పచ్చిమిర్చి - 10
ఉల్లిపాయలు - 2 (సన్నని ముక్కలు)
పసుపు- పావు స్పూన్
ధనియాల పొడి - తగినంత
పోపు దినుసులు- (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు),
కరివేపాకు- రెండు రెమ్మలు
నూనె: రెండు స్పూన్స్
ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:
ముందుగా వంకాయలను తరిగి ఉప్పు వేసిన నీటిలో కొద్దిసేపు నానబెట్టాలి. దీనివల్ల వంకాయల్లోని వగరు రుచి పోతుంది. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి నూనెలో మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. మూతపెట్టి నూనె పైకి తేలే వరకు సన్నని మంటపై ఉడికించాలి. ఆపై అల్లం, పచ్చి మిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసి కూరలో కలిపి, ఉడికించి చివరగా ధనియాల పొడి చల్లుకుని దించేస్తే ఘుమఘుమలాడే అల్లంపచ్చికారం వంకాయ కూర సిద్ధం.
అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. వంకాయలో పీచు పదార్థం, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి కూడా ఇది ఎంతో మంచిది. శీతాకాలంలో లేదా వర్షాకాలంలో ఇలాంటి కారకారంగా, అల్లం ఘాటుతో కూడిన కూరలు తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.













Click it and Unblock the Notifications
