ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కు షాకిచ్చిన లాయర్- ఆ సీట్లో కూర్చొనే అర్హత లేదంటూ వాగ్వాదం..!
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో (Supreme Court) ఇవాళ ఓ సంచలన ఘటన చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) వద్దకు ఓ అత్యవసర కేసు గురించి ప్రస్తావించేందుకు వచ్చిన ఓ లాయర్ భారీ షాకిచ్చాడు. తాను తీసుకొచ్చిన కేసును తీసుకునేందుకు ఆగాలని కోరిన ఛీఫ్ జస్టిస్ పై ఎదురుదాడికి దిగాడు. సీజేఐ అనే గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా రెచ్చిపోయాడు. దీంతో సుప్రీంకోర్టు లైవ్ ప్రసారాన్ని ఆపాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవాళ సీజేఐ సూర్యకాంత్ ఎదుట హాజరైన న్యాయవాది.. 'మీరు ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హులు కాదు, మీకు నిజాయితీ లేదు' అని వ్యాఖ్యానించారు. దీంతో సుప్రీంకోర్టు విచారణ ఆపి ఒక్క క్షణం అవాక్కైంది. అంతకు ముందు సదరు లాయర్ తీసుకొచ్చిన కేసు ప్రస్తావనపై స్పందిస్తూ సీజేఐ 'చూస్తాం' అని తెలిపారు. కానీ న్యాయవాది ఆగడానికి నిరాకరించారు. తన విషయం అత్యవసరమైనదని పేర్కొంటూ, దానిని ప్రస్తావించినందుకు ముందుగానే క్షమాపణ చెప్పారు.

ఈ అంశాన్ని నవంబర్ 2న జస్టిస్ సూర్యకాంత్ కార్యాలయంలో ఆయనకు ఇచ్చానని, 15 రోజులు గడిచినా ఆయన తనకు సమాధానం ఇవ్వలేదని, అందుకే ఈ కోర్టు ముందుకు రావాల్సి వచ్చిందని సదరు న్యాయవాది తెలిపారు. దీంతో సీజేఐ బెంచ్ లోనే ఉన్న మరో జడ్జి జె మోహన్.. మీరు ఇలాంటిది ప్రస్తావించకూడదన్నారు. కానీ న్యాయవాది.. లేదు, ఇది అత్యవసరం కాబట్టి వచ్చానన్నారు. ముందుగా తన క్షమాపణ తెలియజేయాలనుకుంటున్నానని, దయచేసి మీరు ఈ పత్రాలను చూడాలని కోరారు. సీజేఐ చూస్తాం, మీరు ఆగండి అన్నారు. కానీ న్యాయవాది.. లేదు, నేను ఆగను. మీరు ఆ కుర్చీలో కూర్చోలేరు, మీకు అర్హత లేదు. మీకు ఆ అర్హత లేదు, దానికి కావలసిన నిజాయితీని కలిగి ఉండాలని కోరారు. దీంతో కోర్టు కార్యకలాపాలను కొద్దిసేపు నిలిపివేశారు.













Click it and Unblock the Notifications
