అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక విజ్ఞప్తి.. ఆ ఆచారం పాటించొద్దంటూ సూచన!
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే లక్షలాది మంది భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసింది. మరో కొద్ది రోజుల్లో రెండు నెలల పాటు సాగే మండల, మకరవిళక్కు మహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ నుండి తరలివచ్చే అయ్యప్ప స్వాములను ఉద్దేశించి దేవస్వం బోర్డు అధ్యక్షులు కె. జయకుమార్ కీలక విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు ఆయన ఒక ప్రత్యేక లేఖ రాశారు. "పరిశుభ్రమైన శబరిమల - పవిత్రమైన శబరిమల" అనే ప్రధాన నినాదంతో ఈ ఏడాది యాత్రను నిర్వహిస్తున్నట్లు జయకుమార్ వెల్లడించారు. ముఖ్యంగా భక్తులు పవిత్రంగా భావించే పంపా నదిలో పాత దుస్తులను వదిలివేయడం వల్ల పర్యావరణానికి, నదీ జలాల స్వచ్ఛతకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నదిలో బట్టలు విడిచిపెట్టడం అనేది కేవలం ఒక అలవాటుగా మారిందే తప్ప, దానికి ఎలాంటి మతపరమైన లేదా ఆచారపరమైన ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి, ఈ అనాచారాన్ని విడనాడి, పంపా నది పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని భక్తులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎస్‌ను కోరారు.
యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గతంలో ఎదురైన లోపాలను ఈసారి పూర్తిగా సరిదిద్దామని బోర్డు చైర్మన్ తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ, మరుగుదొడ్ల వినియోగాన్ని పూర్తిగా ఉచితం చేశామన్నారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే బాధ్యతను ఒక ప్రత్యేక ప్రొఫెషనల్ ఏజెన్సీకి అప్పగించామని పేర్కొన్నారు. అలాగే, భక్తుల రద్దీకి అనుగుణంగా సరిపడా అరవణ ప్రసాదం నిల్వలను సిద్ధంగా ఉంచామని భరోసా ఇచ్చారు.
శబరిమల అటవీ ప్రాంతం పెరియార్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటంతో పర్యావరణ పరిరక్షణకు కేరళ హైకోర్టు మరియు అటవీ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇరుముడిలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించారు. భక్తులు కేవలం పర్యావరణ హితమైన వస్తువులను మాత్రమే వెంట తీసుకెళ్లాలని, ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీ నుంచి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు, వైద్య శిబిరాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు.












Click it and Unblock the Notifications
