రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి పెళ్లి ఫిక్స్.. వధువు ఎవరంటే..?
తెలుగు ప్రేక్షకులకు దివంగత నటుడు రియల్ స్టార్ శ్రీహరి సుపరిచితమే.. టాలీవుడ్ లో తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నారు. అయితే త్వరలోనే ఆయన ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. సంజన అనే యువతితో ఆయన వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు శశాంక్ శ్రీహరి- సంజనల నిశ్చితార్థ వేడుక వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న ఇరు కుటుంబాల సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. అయితే పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఇరు కుటుంబాల మధ్య ఏళ్లుగా ఉన్న పరిచయం, సాన్నిహిత్యం కారణంగా పెద్దలు ఈ వివాహం కుదిర్చినట్లు తెలుస్తోంది. ఇక శ్రీహరి, ఆయన భార్య నటి డిస్కో శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడు శశాంక్ శ్రీహరి కాగా చిన్నబ్బాయి మేఘాంశ్ శ్రీహరి.
శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ శ్రీహరి ఇప్పటికే తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. 2019 లో రాజ్ దూత్ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. ఇక ఇటీవల ఆస్మాన్ అనే మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాను శ్రీ క్లింకార సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీతోపాటు లెల్లా రోహిత్ దర్శకత్వంలో పోతురాజు ఆహార్యంలో మరో భారీ చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నట్లు సమాచారం.

ఇక శ్రీహరి 1996 లో డిస్కో శాంతిని వివాహం చేసుకున్నారు. ఆయన 2013 అక్టోబర్ 9న మృతి చెందారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక 1984 లో యుద్ధం సినిమాతో ఆయన సినీ కెరీర్ ప్రారంభించారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. ఆయన 2013 లో ప్రాణాలు కోల్పోయినా తన సినిమాలతో ఎప్పటికీ ప్రేక్షకుల గుండెళ్లో చెరగని ముద్ర వేశారు. మరోవైపు శ్రీహరి- సంజనలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
