కాంగ్రెస్ మళ్లీ గెలవదు-నేనూ పోటీ చేయను- మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్..!
తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్ధితులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో ఎదురవుతున్న పరిస్ధితుల నేపథ్యంలో తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేదని, తాను కూడా ఎన్నికల్లో పోటీ చేసేది లేదంటూ వ్యాఖ్యానించారు. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని తుమ్మల నాగేశ్వరరావు తేల్చిచెప్పేసారు. ఎల్ నినో ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే మంచిదని తుమ్మల తెలిపారు. పెన్షన్ పెంచుతామని చెప్పారని, ఏమైందని గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారని ప్రభుత్వానికి గుర్తుచేశారు. కేసీఆర్ ఇచ్చినంతే మీరు ఇస్తున్నారని, పెంచుతామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదు అని గ్రామాల్లో నిలదీస్తున్నారని, వారు చెప్పేది కూడా నిజమే అన్నారు. 45 లక్షల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని, వాళ్ల ఓట్లు మనకు అవసరం లేదా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం గ్రామాల్లో తీవ్రంగా ఉందని, నీళ్లు, కరెంటుకు ఇబ్బందిగా ఉందని తుమ్మల తెలిపారు.జనవరి నెల తర్వాత తాగడానికి నీళ్లు కూడా దొరికే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఎల్ నినోపై అంచనా వేయలేకపోతుందన్నారు. ఇలాగే కొనసాగితే కష్టమన్నారు. కరువు తర్వాత అధికార పార్టీ గెలిచినట్లు చరిత్రలో లేదన్నారు. జూన్ తర్వాత కూడా ఎల్ నినో ప్రభాావం ఇలాగే కొనసాగితే అధికార పార్టీ (కాంగ్రెస్) ఓడిపోవాల్సిందే అన్నారు. కరువు తర్వాత ఒక్క అధికార పార్టీ కూడా గెలిచినట్టు చరిత్రలో లేదని, హైటెక్ సిటీ కట్టానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు కూడా కరువు తర్వాత ఓడిపోయాడని తుమ్మల గుర్తుచేశారు. తద్వారా కాంగ్రెస్ కూడా ఓడిపోవడం ఖాయమని తుమ్మల నాగేశ్వరరావు తేల్చిచెప్పేశారు.













Click it and Unblock the Notifications
