భారత్ ను తిట్టిన వ్యక్తిని దిల్లీకి పంపించనున్న పాకిస్థాన్.. సర్వత్రా ఉత్కంఠ..!
భారత రాజధాని దిల్లీలో ఈ నెల 20 నుంచి 22 వరకు తొలి 'షాంఘై సహకార సంస్థ (SCO) సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్' జరగనుంది. అయితే ఈ సమావేశానికి పాకిస్థాన్ నుంచి అక్కడి వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మసూద్ మాలిక్ హాజరుకానున్నారు. గత మూడేళ్ల కాలంలో ఒక పాకిస్థాన్ మంత్రి భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
గతంలో ఆయన సింధు నదీ జలాల నిలిపివేత విషయంలో భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ కు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చేతులను నరికివేయాలని తీవ్ర పదజాలంతో విమర్శలు చేసిన ముసాదిక్ మసూద్ మాలిక్ ఇప్పుడు దిల్లీలో పర్యటనకు రానున్నారు. ఈ మేరకు తాజాగా ఈ సమావేశానికి పాకిస్థాన్ నుంచి ఆయన్ను నియమిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక 2025లో జరిగిన టియాంజిన్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ఈ సాంస్కృతిక వేదికకు.. బహుపాక్షిక నిబంధనల ప్రకారం ఎస్సీఓలోని మొత్తం 10 సభ్య దేశాలకు భారత్ ఆహ్వానాలు పంపింది. ఈ మేరకు పాకిస్థాన్ కూ భారత్ నుంచి ఆహ్వానం అందింది. అయితే పాకిస్థాన్ తరఫున ఈ సదస్సులో ప్రాతినిధ్యం వహించేందుకు గతంలో భారత్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ముసాదిక్ మసూద్ మాలిక్ ను ఆ దేశం ఎంచుకోవడం గమనార్హం.

ఇక మాలిక్ భారత్ లో పర్యటిస్తే 2023 నుంచి భారత్ లో పర్యటించిన తొలి పాకిస్థాన్ మంత్రిగా ఆయన నిలవనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ కు చెందిన నేషనల్ హెరిటేజ్ అండ్ కల్చరల్ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ను భారత్ ఆహ్వానించింది. కానీ పాకిస్థాన్ మాత్రం దుందుడుకుగా వ్యవహరించి గతంలో భారత్ పై తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తినే దిల్లీకి పంపించడం గమనార్హం. ఇక ఈ సమావేశంలో భారత్- పాకిస్థాన్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక చర్చలకు ఆస్కారం లేదని సమాచారం. మరోవైపు గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications
