రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి: సీఎం చంద్రబాబు
విలువల కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేసిన మహనీయుడు పద్మవిభూషణ్ రామోజీరావు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఆయన తెలుగు జాతి కీర్తి, తరతరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. రామోజీరావు స్థాపించిన సంస్థలు తెలుగు జాతికి ఆస్తులని అన్నారు. రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తొమ్మిది రంగాల్లో విశిష్ట సేవలందించిన తొమ్మిది మందికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వరుసగా రెండో ఏడాది ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఏటా ఈ వేడుకలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
కృష్ణా జిల్లాలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు తన సంకల్పం, క్రమశిక్షణ, విలువలు, నాణ్యత, విశ్వసనీయతతో గొప్ప సంస్థలను స్థాపించి సమర్థంగా నడిపించారని సీఎం వివరించారు. ప్రజల కోసం జర్నలిజాన్ని నమ్ముకుని, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని పోరాటం చేసిన వ్యక్తి అని ప్రశంసించారు. ఈనాడు, మార్గదర్శి, ఈటీవీతో పాటు విలువలతో కూడిన సినిమాలను సమాజానికి అందించారన్నారు.
ప్రజా సమస్యలపై స్పందించడంతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఈనాడు సంస్థ ప్రజలకు అండగా నిలిచిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి పేరు నిర్ణయించే సమయంలో లోతుగా అధ్యయనం చేసి అమరావతి అనే పేరును సూచించారని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్లు, కరోనా సమయంలో రాష్ట్రానికి మరో రూ.10 కోట్లు విరాళంగా అందించారని తెలిపారు. ప్రతి రాత్రి 9 గంటలకు ఈటీవీ వార్తలు చూసి ప్రజలు సమాచారాన్ని తెలుసుకునే స్థాయిలో ఆ సంస్థ విశ్వసనీయత సంపాదించిందన్నారు.
ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలవంచలేదు..
ఎన్ని కష్టాలు, ఒత్తిళ్లు ఎదురైనా రామోజీరావు ఎవరికీ తలవంచలేదని చంద్రబాబు అన్నారు. కోట్లాది మంది పాఠకుల విశ్వాసమే ఆయనకు బలమైన శక్తిగా నిలిచిందన్నారు. విచారణల పేరుతో ఇబ్బందులకు గురిచేసినా, అనారోగ్యంతో మంచంపై ఉన్న వీడియోలను విడుదల చేసి అవమానించే ప్రయత్నాలు చేసినా ఆయన తన పోరాట పంథాను వీడలేదని పేర్కొన్నారు. విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిలబడిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఆయన జయంతి కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకావడం రామోజీరావుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని సీఎం చెప్పారు.
రామోజీరావు సేవలు దేశానికి స్ఫూర్తిదాయకం: అమిత్ షా
రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొందరు వ్యక్తులు తమ కృషితో సంస్థలుగా, వ్యవస్థలుగా మారిపోతారని.. వారి సేవలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తుల్లో రామోజీరావు ఒకరని పేర్కొన్నారు.
రామోజీరావును రామ్ నాథ్ గోయెంకా వంటి విశిష్ట పాత్రికేయులతోనే పోల్చగలమన్నారు. మారుతున్న కాలానికి, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా రామోజీరావు తన సంస్థలను అభివృద్ధి చేశారని అమిత్ షా వివరించారు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పత్రికను ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిపారని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాల కారణంగా పలు దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నా భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గత 12 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. గతంలో ఏటా వేల సంఖ్యలో నక్సల్ దాడులు జరిగేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు.

పదేళ్లలో దేశంలోనే అగ్రస్థానానికి ఏపీ: అమిత్ షా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నిరంతరం అభివృద్ధి చెందుతోందని అమిత్ షా ప్రశంసించారు. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందా అని తొలుత భావించానని, అయితే చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టారని అన్నారు. దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి గణాంకాలను తాను నిశితంగా పరిశీలిస్తుంటానని, వచ్చే పదేళ్లలో చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
