చరిత్ర పుటల్లో నిలిచిన 1987 నాటి జ్ఞాపకాలు.. అక్వాన్ ఆగమనం
ఒక్క తుఫాన్ వస్తేనే తీర ప్రాంతం అతలాకుతలమైపోతుంది. రైతన్నలు కన్నీటి పర్యంతమవుతారు. అలాంటిది కేవలం నెల రోజుల వ్యవధిలో ఏకంగా మూడు తుఫాన్లు తరుముకొస్తే ఆ పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఊహించలేం. ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్ల దెబ్బ నుంచి కోలుకోకముందే, ఇప్పుడు 'అక్వాన్' రూపంలో మరో పెనుముప్పు ముంచుకొస్తోంది. దీంతో చరిత్ర పుటల్లో నిలిచిన 1987 నాటి ఎల్‌నినో జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు
ఇలా నెల రోజుల వ్యవధిలో మూడు తుఫాన్లు రావడం అత్యంత అరుదైన పరిణామం. సరిగ్గా ఇలాంటి ఘటనే 39 ఏళ్ల క్రితం అంటే 1987లో జరిగింది. విచిత్రం ఏమిటంటే, అప్పట్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడు కూడా అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. 1987లో ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్రమైన కరవు రావడంతో పాటు, అక్టోబర్ 16 నుంచి నవంబర్ మధ్య కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే వరుసగా మూడు తుఫాన్లు కోస్తా తీరాన్ని తాకాయి. ఇప్పుడు 2026లో కూడా ఎల్‌నినో సంవత్సరంలోనే ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తడం విశేషం.

మరోసారి భయపెడుతున్న నవంబర్ సెంటిమెంట్
ఏపీలో తుఫాన్ అనగానే దివిసీమ ఉప్పెన సృష్టించిన విలయతాండవం కళ్ల ముందు కదలాడుతుంది. అత్యంత ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చిన ఆ విపత్తు 1977 నవంబర్ 19న తీరం దాటింది. సరిగ్గా 49 సంవత్సరాల తరువాత, మళ్లీ అవే తేదీల్లో (నవంబర్ 19, 20) ఇప్పుడు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. గూగుల్ మ్యాప్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా, నవంబర్ నెలలో వచ్చే తుఫాన్ల తీవ్రత మాత్రం తీర ప్రాంత ప్రజలను వణికిస్తూనే ఉంది.
దూసుకొస్తున్న 'అక్వాన్'..
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి తూర్పుగా, మచిలీపట్నానికి ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. గంటకు 3 కిలోమీటర్ల అతి మందకొడి వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం, క్రమంగా బలపడి అత్యంత తీవ్ర తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నవంబర్ 20 మధ్యాహ్నం సమయానికి నెల్లూరు - తుని మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 120 నుంచి 130 కిలోమీటర్లు, కొన్నిసార్లు 145 కిలోమీటర్ల వరకు వీచే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
అప్రమత్తమైన యంత్రాంగం.. తీర ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు
ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి, ఈ తాజా 'అక్వాన్' తుఫాన్ హెచ్చరికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ గమనం, గాలి తీవ్రత, వర్షపాతం ప్రభావంపై నిరంతరం నిఘా ఉంచారు. ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, సహాయక చర్యలకు సిద్ధం చేస్తోంది. వరుసగా వస్తున్న ఈ ప్రకృతి విపత్తుల నుంచి కోస్తా తీరం ఎలా గట్టెక్కుతుందోనని అందరిలోనూ ఆందోళన నెలకొంది.














Click it and Unblock the Notifications
