AP 12th PRC: ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విధివిధానాల విడుదల..! డెడ్ లైన్ ఇదే..!
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీపై (AP 12th PRC) మరో అడుగు పడింది. ఉద్యోగులకు చేసే వేతన సవరణలో పరిశీలించే అంశాల్ని ఖరారు చేస్తూ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తమ అభ్యంతరాలను డిసెంబర్ 31లోగా తెలియజేయాలని గడువు విధించింది. ఆ లోపు వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా తమ రిపోర్టులో మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వానికి కమిషన్ తుది నివేదిక ఇవ్వనుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం యూజీసీ, ఎన్సీటీఈ, బార్ కౌన్సిల్ పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల అధ్యాపకులు, రెండో జాతీయ న్యాయ వేతన సంఘం సిఫార్సుల పరిధిలోకి వచ్చే న్యాయాధికారులు ఈ పీఆర్సీ పరిధిలోకి రారని ప్రభుత్వం తెలిపింది. ఇక పీఆర్సీ దృష్టిసారించబోతున్న అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది, డిప్యూటీ ఉద్యోగులు, శాశ్వత కంటింజెంట్ ఉద్యోగుల జీతభత్యాలు, సర్వీస్ నిబంధనలపై సిఫారసులు చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న డీఏను మూలవేతనంలో ఎంతవరకు విలీనం చేయవచ్చో పరిశీలించి, కొత్త వేతన స్కేళ్లను కమిషన్ నిర్దేశించనుంది.

అలాగే ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమల్లో ఎదురవుతున్న లోపాలను అధ్యయనం చేసి, దీనిని కొనసాగించాలా లేదా మార్పులు చేయాలా అనే అంశంపై సూచనలు ఇవ్వనుంది. దీంతో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న స్పెషల్ పే, కన్వెన్షన్ అలవెన్సులు, ఇతర భత్యాల అవసరాన్ని సమీక్షించి వాటి రేట్లు, నిబంధనలపై సిఫారసులు చేయనుంది. అలాగే పెన్షనర్ల ప్రస్తుత పెన్షన్ విధానాన్ని సమీక్షించి తగిన మార్పులు సూచించనుంది. ఏదైనా కేటగిరీ పోస్టులను గ్రేడెడ్ విధానంలోకి మార్చడానికి అవసరమైన నిబంధనలను కూడా రూపొందించనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంట్రాక్టు, డిప్యుటేషన్ నిబంధనలతో సహా శాఖల్లోని మానవ వనరుల అవసరాలను సమీక్షిస్తారు. చివరిగా ఈ సిఫారసులన్నింటినీ రూపొందించేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.














Click it and Unblock the Notifications
