ఆరు నెలల్లో ఏపీ పీఆర్సీ రిపోర్ట్ ? ఉద్యోగుల తాజా డిమాండ్స్ ఇవే..!
ఏపీలో వేతన సవరణ కోసం కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో (AP Employees) అసహనం పెరుగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం నియమించిన 12వ పీఆర్సీ కమిషన్ (12th PRC) ఛైర్మన్ ఈ ప్రభుత్వం రాగానే రాజీనామా చేయడం, ఆ తర్వాత కొత్త కమిషనర్ ను నియమించడానికి సీఎం చంద్రబాబు రెండున్నరేళ్లు తీసుకోవడం, ఆ కొత్త కమిషనర్ కూడా వేతన సవరణ అధ్యయనం తీరిగ్గా చేసుకుంటూ పోతుండటం వారిలో ఆగ్రహానికి కారణమవుతోంది. దీంతో పీఆర్సీ రిపోర్ట్ ను ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి ఇవ్వాలంటూ ఇవాళ కమిషనర్ ను కలిసి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులు అల్టిమేటం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో 12వ పీఆర్సీ కమిషనర్ దినేష్ కుమార్ ను రాష్ట్ర సచివాలయంలో ఏపీ జేఏసీ అమరావతి నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను 12వ పీఆర్సీ నివేదికను ఆరు మాసాల్లో ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ నియామకంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని, ఈ జాప్యం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌కు రిపోర్ట్ సమర్పించేందుకు సంవత్సరం కాలపరిమితి ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, డేటాను, డిజిటల్ విధానాలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని, అలాగే ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు కోసం అన్ని శాఖల్లో ఉద్యోగులకు సంబంధించిన డేటా అప్డేట్ గా ఉందని, ఇవన్నీ వినియోగించుకోవడం ద్వారా ఆరు మాసాల్లోనే నివేదికను ప్రభుత్వానికి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, విద్య, వైద్యం, గృహ నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను నిర్వహించడం ఉద్యోగులకు భారంగా మారుతోందని ఏపి జేఏసీ అమరావతి నాయకులు పేర్కొన్నారు. వేతన సవరణలో జాప్యం కారణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోవడమే కాకుండా, వారి కుటుంబాల ఆర్థిక ప్రణాళికలు కూడా దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా తక్కువ పెన్షనతో పెన్షనర్లు, చాలీచాలని వేతనంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అలాగే గత 11 వ పీఆర్సీకి సంబంధించిన బకాయిల చెల్లింపులు ఇంకా పూర్తికాకపోవడం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని తెలిపారు. 11వ పీఆర్సీ బకాయిలు పూర్తిగా చెల్లించని పరిస్థితుల్లో 12వ పీఆర్సీ ప్రక్రియలో ఎంత ఆలస్యమైతే ఉద్యోగులకు అంత అన్యాయం జరుగుతుందన్నారు.

12వ పీఆర్సీ జాప్యం వల్ల 2022 నుండి ప్రతి సంవత్సరం 10 వేలకు పైగా రిటైరయ్యే ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. వేతన సవరణ ప్రయోజనాలు ఆలస్యమైతే పదవీ విరమణ ప్రయోజనాలు, పెన్షన్ సంబంధిత ఆర్థిక ప్రయోజనాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గతంలో పీఆర్సీ ప్రక్రియలో జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి నివేదిక తయారీలో కాలయాపనకు తావులేకుండా ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను త్వరితగతిన సేకరించాలని, అవసరమైన సమాచారాన్ని డిజిటల్ విధానంలో విశ్లేషించి, నిర్ణీత కాలపరిమితి కంటే ముందుగా నివేదికను సమర్పించాలని పీఆర్సీ కమిషనర్‌ను కోరారు.














Click it and Unblock the Notifications
