కుర్తాకు కాస్త బ్రేక్.. మోదీ స్టైలిష్ లుక్ చూశారా?
ఎక్కడికి వెళ్లినా మన దేశ సంప్రదాయాన్ని చాటిచెప్పేలా కుర్తా-పైజామా, జాకెట్ ధరించడం ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక గుర్తింపు. కానీ ఈసారి ఆయన తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. ఫిలిప్పీన్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ సంప్రదాయాన్ని గౌరవిస్తూ అక్కడి అధికారిక దుస్తులను ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. విదేశీ గడ్డపై మన ప్రధాని ధరించిన ఈ సరికొత్త వస్త్రధారణ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, డిప్లొమాటిక్ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
భారత్-ఆసియాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాకు వెళ్లారు. అక్కడ పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ విదేశీ అధినేతలు, ప్రముఖ అతిథుల కోసం ప్రత్యేకంగా గాలా డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు హాజరైన ప్రధాని మోదీ.. ఆ దేశ సాంస్కృతిక గౌరవానికి ప్రతీకగా నిలిచే 'బరోంగ్ తగలోగ్' అనే ప్రత్యేక దుస్తులను ధరించి సభకు విచ్చేసారు.

ప్రత్యేకమైన ఎంబ్రాయిడరీ డిజైన్‌తో ఆకర్షణీయమైన రూపం
ఫిలిప్పీన్స్‌లో పురుషులు అత్యంత ప్రతిష్టాత్మక వేడుకలకు ధరించే ఈ సాంప్రదాయ చొక్కాపై అందమైన పూలు, సుడులు తిరిగిన క్లిష్టమైన ఎంబ్రాయిడరీ పనితనం ఉంది. కాలర్ ఉన్న ఈ డిజైనర్ షర్టుకు తోడుగా మోదీ బంగారు రంగు బ్రాచ్, పచ్చని హంగులతో కూడిన రంగురంగుల గులాబీ ఆకారపు లాపెల్ పిన్‌ను ధరించి తన లుక్‌ను మరింత పరిపూర్ణం చేసుకున్నారు. ఆయనతో పాటు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ కూడా అవే దుస్తుల్లో కనిపించగా, ప్రథమ మహిళ లూయిస్ అరానెటా-మార్కోస్ నీలిరంగు ఎంబ్రాయిడరీ ఉన్న ఐవరీ గౌనులో మెరిసారు.
ఏంటి ప్రత్యేకత? అసలుసిసలు 'బరోంగ్ తగలోగ్' కథేంటి?
ఫిలిప్పీన్స్‌లో పెళ్లిళ్లు, అధికారిక వేడుకలు, ప్రత్యేక సందర్భాల్లో పురుషులు ఎక్కువగా ఈ 'బరోంగ్ తగలోగ్'ను ధరిస్తారు. సాధారణ షర్టులా కాకుండా ఇది చాలా తేలికగా, కాస్త పారదర్శకంగా ఉండి.. ప్యాంటు లోపలకు ఇన్‌పుట్ చేయకుండా బయటే వేలాడేలా డిజైన్ చేసి ఉంటుంది. ముఖ్యంగా పైనాపిల్ ఆకు నారతో తయారయ్యే 'పిణా' లేదా సిల్క్ వంటి సున్నితమైన ఫ్యాబ్రిక్‌తో దీన్ని తయారు చేస్తారు. దీనిపై ఉండే పువ్వులు, రేఖాగణిత నమూనాల అల్లిక ఈ దుస్తులకే ప్రత్యేక వన్నె తెస్తుంది. కొన్నిసార్లు ఫ్యాషన్ ద్వారా కూడా బలమైన దౌత్య సందేశాలను పంపవచ్చని మోదీ మరోసారి నిరూపించారు.
రంగుల సంస్కృతితో కళకళలాడిన విందు వేడుక
మనీలాలోని ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ విందు కేవలం భోజనానికే పరిమితం కాలేదు. ఫిలిప్పీన్స్ సాంస్కృతిక నృత్యాలు, స్థానిక వంటకాలతో ఈ వేడుక ఎంతో ఉత్సాహంగా సాగింది. ఇక అంతకుముందు ప్రధాని మోదీకి ఫిలిప్పీన్స్‌లో ఉన్న ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. పిల్లలు పూర్ణ కుంభ శ్లోకాలు చదవడం, బాలీవుడ్, భాంగ్రా నృత్యాలతో పాటు ఫిలిప్పీన్స్ శైలిలో రామాయణ ప్రదర్శన అక్కడికి వచ్చిన అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.














Click it and Unblock the Notifications
