ప్రధాని మోదీ నా ఫోన్ ట్యాప్ చేస్తోన్నాడహో: ట్రిగ్గర్ నొక్కిన రాహుల్ గాంధీ
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలు, విదేశీ శక్తుల ప్రమేయానికి సంబంధించిన అనేక ఆధారాలు తన ఫోన్‌లోనే భద్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రధాని మోదీతో నేరుగా ముఖాముఖి బహిరంగ చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై నిర్వహించిన ఆస్క్ మీ ఇంటరాక్టివ్ సెషన్‌లో నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీతో తన ముఖాముఖి చర్చ జరిగితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని పునరుద్ఘాటించారు. ఆ డిబేట్ పూర్తయిన తర్వాత మోదీ ఇక ప్రధాని పదవిలోనే కొనసాగలేరని స్పష్టం చేశారు. విదేశీ శక్తుల ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తున్నారు, నిజమైన దేశద్రోహులు ఎవరనేది ఈ ఒక్క చర్చతో దేశ ప్రజల ముందుకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం చెబుతోందని, బయటే బహిరంగ చర్చ జరగాలంటూ ఎందుకు పట్టుబడుతున్నారంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని, ప్రాముఖ్యత ఉన్న అంశాలు లేవనెత్తినప్పుడు మైక్‌ను పదేపదే కట్ అవుతోందని వివరించారు. సభలో సుదీర్ఘ ప్రసంగాలు ఇవ్వడం కంటే, ఇద్దరు నేతలు ఎదురెదురుగా కూర్చొని ప్రత్యక్షంగా ప్రశ్నించుకునే విధానమే పారదర్శకంగా ఉంటుందని అన్నారు.
గతంలో రైతుల నిరసనలకు కారణమైన సాగు చట్టాలు, ఓట్ల అక్రమాల వివాదం, చైనా సరిహద్దు ఘర్షణలు, మాజీ సైనికాధిపతి జనరల్ నరవణే రాసిన పుస్తకంలో ఉన్న విషయాలు, అలాగే అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చిన ఎప్‌స్టీన్ ఫైల్స్ వంటి కీలకాంశాలపై సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారని రాహుల్ గుర్తు చేశారు. ప్రధాని మోదీతో తాను ప్రతిపాదించిన డిబేట్ కు గౌతమ్ అదానీ గానీ ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌ను జడ్జీలుగా నియమించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.
మరోవంక.. రాహుల్ గాంధీ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, బహిరంగ చర్చ సవాల్‌ను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. పార్లమెంట్‌లో జరిగే ప్రజాస్వామ్యబద్ధ చర్చల నుంచి తప్పించుకోవడానికే రాహుల్ గాంధీ ఇటువంటి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సభలో మాట్లాడకుండా బయట బహిరంగ చర్చల పేరుతో సవాల్ విసరడం ఆయన రాజకీయ అపరిపక్వానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
Rahul Gandhi challenges PM Modi to a one-on-one debateCongress leader Rahul Gandhi said that his phone contains evidence supporting all his allegations and claimed that the Prime Minister has tapped his phone.He further said that a one-on-one debate would reveal who is controlled by foreign powers, who is anti-national, and since when, adding that he has several other details on his phone.@RahulGandhi
— Atulkrishan (@iAtulKrishan1) November 13, 2026
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివాదంపై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఏ అంశంపైనైనా సుదీర్ఘంగా చర్చించడానికి పార్లమెంట్ ఇప్పటికే అందుబాటులో ఉన్న అత్యుత్తమ వేదిక అని వ్యాఖ్యానించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత వంటి అత్యంత రాజ్యాంగబద్ధమైన బాధ్యతాయుత స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ అనవసరమైన రాజకీయ గారడీలు చేయకుండా, విషయ తీవ్రతను అర్థం చేసుకోవాలని హితవు పలికారు.













Click it and Unblock the Notifications
