రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పీఎం రాహత్ మార్గదర్శకాలు!
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి డబ్బు లేకుండా సకాలంలో చికిత్స అందించేందుకు కేంద్రం ప్రారంభించిన 'పీఎం-రాహత్' ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి చేరిక, హామీ చికిత్స పథకం అన్ని ఆస్పత్రులలోనూ అమలయ్యేలా మార్గదర్శకాలను జాతీయ వైద్య కమీషన్ ఇచ్చింది.. ఈ పథకం కింద అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, వాటి అనుబంధ ఆసుపత్రులు తప్పనిసరిగా ఎంప్యానెల్ కావాలని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్‌తో సహా దేశవ్యాప్తంగా ఈ మార్గదర్శకాలు అమలు కావాలని ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లాంగర్ అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల డీన్లు, డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల మెడికల్ సూపరింటెండెంట్లకు సోమవారం సమాచారం అందించారు. పీఎం-రాహత్ పథకం 2026 ఫిబ్రవరి 13న దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 162 ప్రకారం ఈ పథకం రూపొందించబడింది.

ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటలో గోల్డెన్ అవర్ లో సకాలంలో చికిత్స అందితే సుమారు సగం మరణాలను నివారించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఈ పథకం ద్వారా ప్రతి బాధితుడికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందుతుంది. ఇది ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడు రోజుల పాటు వర్తిస్తుంది. ప్రాణాపాయం లేని కేసుల్లో 24 గంటలు, తీవ్ర గాయాలైన వారికి 48 గంటల వరకు స్టెబిలైజేషన్ చికిత్స అందిస్తారు.
ఎన్‌ఎంసీ మార్గదర్శకాల ప్రకారం ట్రామా కేర్, ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ విభాగాలు ఉన్న ఆసుపత్రులు ప్రత్యేకంగా ఎంప్యానెల్ కావచ్చు. ఈ ఆసుపత్రుల్లో 24 గంటలూ అత్యవసర సేవలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, సీటీ స్కాన్, ఎక్స్-రే వంటి ఇమేజింగ్ సదుపాయాలు, బ్లడ్ బ్యాంక్, అంబులెన్స్ సౌకర్యాలు తప్పనిసరి. ఎంప్యానెల్ కాని ఆసుపత్రులు కూడా ఎన్‌హెచ్‌ఏఐ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని గోల్డెన్ అవర్‌లో ప్రాథమిక చికిత్స అందించి, తర్వాత పెద్ద ఆసుపత్రులకు పంపించవచ్చు.
జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలోని ప్రమాద హాట్‌స్పాట్‌ల వద్ద ఉన్న ఆసుపత్రుల నమోదుకు ప్రాధాన్యం ఇస్తారు.ఈ పథకం అమలులో ఈ-డీఏఆర్ (eDAR) ప్లాట్‌ఫామ్, టీఎంఎస్ 2.0 పోర్టల్ ద్వారా రియల్ టైమ్ ట్రాకింగ్ జరుగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే 112 నంబర్‌కు కాల్ చేస్తే సమీపంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రి వివరాలు, అంబులెన్స్ సహాయం అందుతాయి.
పోలీసు ధృవీకరణ తర్వాత ఆసుపత్రులకు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ (ఎంవీఏఎఫ్) నుంచి ఖర్చులు చెల్లిస్తారు. బీమా ఉన్న వాహనాల విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీలు, హిట్ అండ్ రన్ లేదా బీమా లేని కేసుల్లో ప్రభుత్వ బడ్జెట్ నుంచి నిధులు వస్తాయి. ఆమోదించిన క్లెయిమ్స్‌ను 10 రోజుల్లోపు ఆసుపత్రులకు చెల్లించాలని నిబంధనలు ఉన్నాయి.ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మంది బాధితులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు.
తెలంగాణలోనూ వివిధ జిల్లాల్లో ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల ద్వారా సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ వైద్య సంస్థలు ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా అనుసంధానం కావడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే సంఖ్య తగ్గి, బాధితుల కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా వైద్యం అందే అవకాశం మరింత పెరుగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి, 112కు కాల్ చేయడం ద్వారా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.













Click it and Unblock the Notifications
