డీజిల్, ఏటీఎఫ్ పై కేంద్రం రివ్యూ- ఎక్స్‌పోర్ట్స్ ట్యాక్స్ పెంపు
కేంద్ర ప్రభుత్వం విదేశాలకు ఎగుమతి చేసే డీజిల్, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై విండ్‌ఫాల్ పన్నును పెంచింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నూతన పన్ను రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చాయి. పెట్రోల్ ఎగుమతులపై పన్నును ఏమాత్రం పెంచలేదని, ఇవి యధాతథంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేసింది. నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ పక్షం రోజుల వ్యవధికి ఈ పన్నులు వర్తిస్తాయి.
తాజా సవరణల ప్రకారం.. ఏటీఎఫ్ ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ లీటరుకు రూ.11 నుంచి రూ. 12.50కి పెరిగింది. అలాగే డీజిల్ ఎగుమతులపై రహదారి, మౌలిక సదుపాయాల సెస్‌తో కలిపి విధించే అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.11.50 నుంచి రూ.14కు పెంచింది కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో వచ్చే మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకొకసారి ఈ పన్ను రేట్లను సమీక్షిస్తుంటుంది.

వాహనదారులకు విక్రయించే పెట్రోల్, డీజిల్ ధరలపై లేదా వాటి స్థానిక ఎక్సైజ్ సుంకాలపై ఈ విండ్‌ఫాల్ పన్ను పెంపు ఎలాంటి ప్రభావం చూపదని కేంద్రం వివరించింది. దేశీయ వినియోగదారులకు అందుబాటులో ఉండే చమురు ధరలు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. విదేశీ మార్కెట్లకు భారీగా ఇంధనాన్ని ఎగుమతి చేసి అధిక లాభాలు గడించే చమురు శుద్ధి సంస్థల అదనపు ఆదాయం పైనే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది.
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. స్థానిక మార్కెట్ అవసరాలను విస్మరించి, విదేశాల్లో ఉండే అధిక ధరల ప్రయోజనాన్ని పొందడానికి ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీలు ఎగుమతుల వైపే మొగ్గు చూపకుండా నిరోధించడమే దీని ముఖ్య ఉద్దేశం. దీనిద్వారా దేశీయంగా ఇంధన కొరత తలెత్తకుండా తగినంత నిల్వలు అందుబాటులో ఉంటాయి.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల అనిశ్చితి కొనసాగుతున్నంత కాలం ఈ పక్షం రోజుల సమీక్షల ప్రక్రియ కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుద్ధి చేసిన చమురు ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాలను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేయడం ద్వారా దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను సుస్థిరం చేయవచ్చని, అదే సమయంలో విదేశీ మార్కెట్ల నుంచి ప్రైవేట్ శుద్ధి సంస్థలకు లభించే అదనపు లాభాలపై పన్ను విధించడం ద్వారా ప్రభుత్వ రాబడిని కూడా పెంచుకోవడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications
