ఏపీలో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, తెలంగాణాను మించి ఫుడ్ ఇన్ఫ్లేషన్!
ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్ 2026లో రాష్ట్రంలో ఆహార ద్రవ్యోల్బణం 13.23 శాతానికి చేరుకుని దేశంలోనే అత్యధికంగా నమోదైంది. సెప్టెంబర్‌లో 10.2 శాతం ఉన్న ఈ రేటు ఒక్క నెలలోనే మరో మూడు శాతం పైగా పెరిగింది. జాతీయ సగటు 8.94 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్ దానికంటే 4.29 శాతం ఎక్కువగా ఉంది.
పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు 12.37%, కర్ణాటక 12.16%, ఒడిశా 11.66%, తెలంగాణ 10.92% కంటే కూడా ఎక్కువగా నమోదైంది.ఈ ధరల పెరుగుదల ప్రభావం సాధారణ ప్రజల రోజువారీ ఖర్చులపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా బయట తినేవారిని, విద్యార్థులు, నిరుద్యోగ యువతని ఇబ్బంది పెడుతోంది. మూడు నెలల క్రితం కిలో నాణ్యమైన బియ్యం దాదాపు రూ.70 ఉండగా, ఇప్పుడు రూ.90 దాటింది.

వంట నూనె ధరలు సుమారు 25 శాతం పెరిగాయి. గుడ్లు ఒక్కోటి రూ.8 దాటాయి. కందిపప్పు కిలో రూ.180 నుంచి రూ.200 వరకు చేరింది. ఉల్లిపాయల ధరలు గతేడాదితో పోలిస్తే 116 శాతం, వెల్లుల్లి 60 శాతం, అల్లం 48 శాతం, నిమ్మకాయలు 47 శాతం పెరిగాయి.ఈ ముడి సరుకుల ధరల పెరుగుదల హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్డు పక్కని టిఫిన్ సెంటర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపింది.
యజమానులు నిర్వహణ ఖర్చులు భరించలేక మెనూ ధరలు పెంచాల్సి వచ్చింది. గతంలో రూ.120 నుంచి రూ.150 ఉండే భోజనం ధర ఇప్పుడు 10 నుంచి 15 శాతం పెరిగింది. ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల ధరలు కూడా పెరిగాయి. ఒక కప్పు టీ గతంలో రూ.10-15 ఉండగా ఇప్పుడు రూ.20 వరకు చేరింది. చిన్న హోటళ్ల యజమానులు లాభాలు తగ్గిపోయాయని, కేవలం నిర్వహణ ఖర్చులు తీర్చుకోవడానికే ధరలు పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో చాలా మంది సాధారణ ప్రజలు, విద్యార్థులు అన్నా క్యాంటీన్ల వైపు మళ్లుతున్నారు. ఇంట్లో వంట చేసుకోవడం కష్టం అయినవారు హోటళ్లకు వెళ్లలేకపోతున్నారు. ధరల పెరుగుదలకు కారణాలుగా సరఫరా సమస్యలు, వాతావరణ ప్రభావాలు, ఇటీవలి తుఫాను భయాలతో ప్రజలు స్టాక్ చేసుకోవడం వంటివని చెబుతున్నారు. ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు అందిస్తున్నా, నాణ్యత కోసం చాలా మంది మార్కెట్లోనే కొనుగోలు చేస్తున్నారు.
ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం వల్ల ఇంటి బడ్జెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. మధ్యతరగతి కుటుంబాలు ఖర్చులు కుదించుకోవాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నా, మార్కెట్లో ప్రభావం ఇంకా కనిపించడం లేదు. సాధారణ ప్రజలు ధరలు తగ్గాలని ఆశిస్తున్నారు.













Click it and Unblock the Notifications
