ఢిల్లీ భారత్ మండపం తరహాలో విశాఖలో ఆంధ్ర మండపం - ప్రత్యేకతలు..!!
విశాఖ కేంద్రంగా భారీ ప్రాజెక్టు రూపు దిద్దుకుంటోంది. ఢిల్లీలోని భారత్ మండపం తరహాలో విశాఖ లో ఆంధ్ర మండపం నిర్మాణం చేపట్టారు. విశాఖ నగర శివారులోని కాపులుప్పాడ ప్రాంతంలో అత్యంత ఆధునిక హంగులతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఏడాది లోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసారు. సాగర తీరాన సిద్దం చేస్తున్న ఈ మండపం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
విశాఖ నగరంలో సముద్ర మట్టానికి 120 మీటర్ల ఎత్తులో ఫోర్ స్టార్ హోటల్ సదుపాయాలతో భారీ కన్వెన్షన్ హాలుతో ఈ మండపం సిద్దం చేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన భారత్ మండపం తరహాలో ఈ ఆంధ్ర మండపం రూపు దిద్దుకుంటోంది. వచ్చే ఏడాది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) భాగస్వామ్య సదస్సును ఈ కొత్త కన్వెన్షన్ సెంటర్‌లోనే నిర్వహించేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ మండపం కోసం కాపులుప్పాడ కొండపైభాగంలో ఆంధ్ర మండపం నిర్మాణం కోసం 24 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అధికారులు ఏడు ఆప్షన్లతో త్రీడీ నమూనాలను రూపొందించారు.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) విధానంలో నిర్మాణ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. అన్ని సదుపాయాలతో అధునాతన టెక్నాలజీతో నిర్మాణం చేపట్టనున్నారు.
అందులో భాగంగా కన్వెన్షన్ సెంటర్‌గా మాత్రమే కాకుండా.. సదస్సులు, ప్రదర్శనలు, విలాస వంతమైన బస వంటి అన్ని సదుపాయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా మాస్టర్ ప్లాన్ సిద్దం చేసారు. ఈ హాల్ లో అయిదు వేల మంది కూర్చునే సామర్థ్యంతో అత్యాధునిక ఆడియో-విజువల్ టెక్నాలజీ, ఇంటీరియర్స్‌తో ప్రధాన ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం 3.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కేటాయించారు. అలాగే 1.50 లక్షల చదరపు అడుగుల్లో ఎగ్జిబిషన్ హాల్ ఏర్పాటు చేయనున్నారు.
ఇక.. విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు బస చేసేందుకు 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫోర్‌స్టార్ హోటల్‌ను నిర్మించనున్నారు. ఇందు కోసం 250 గదులు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా ప్రాంగణం వెలుపల ఉన్న 6.8 ఎకరాల స్థలంలో అందమైన పూలతోటలు, వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇక్కడ నుంచి అతిథులు సముద్ర అందాలను వీక్షించేలా వ్యూపాయింట్లను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ మండపం పూర్తయితే విశాఖ నగరానికి మరో మణిహారంగా నిలుస్తుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
