కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం..!!
ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యల వివాదం వేళ పార్టీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ లక్ష్యంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో రచ్చగా మారాయి. నిధుల కేటాయింపుతో పాటుగా అవినీతి వ్యవహారాల పైన కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. సీఎం రేవంత్ సైతం సిద్దిపేట సభలో పరోక్షంగా కోమటిరెడ్డి పైన సీరియస్ వ్యాఖ్యలు చేసారు. దీనికి స్పందనగా రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఈ సమయంలో పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారుతోంది.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ - ప్రభుత్వానికి సమస్యగా మారాయి. నేరుగా సీఎం రేవంత్ ను ఉద్దేశించి పబ్లిక్ మీటింగ్స్ లో రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నిధుల కేటాయింపు ను ప్రశ్నిస్తూనే... హామీల అమలు.. ప్రభుత్వంలో పరిణామాల పైన చేస్తున్న వ్యాఖ్యల వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే ఈ అంశం పైన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు.

సమయం వచ్చినప్పుడు అందరినీ పిలుస్తాం..అన్నీ కూడా నిశితంగా పరిశీలిస్తున్నాం.. క్రమశిక్షణ ముందు అందరూ సమానమేనని.. రాజగోపాల్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఏ సందర్భంంలో ఏం మట్లాడారో.. అన్ని మాటల ను పరిశీలిస్తామని చెప్పారు. ప్రతీ దానికి ఓ సమయం ఉంటదని చెప్పుకొచ్చారు. కాగా, రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోలను టీపీసీసీ అధిష్టానానికి పంపింది.
దీంతో.. ఇప్పుడు పార్టీ హైకమాండ్ ఈ వివాదం పైన ఆరా తీసింది. పూర్తి సమాచారం సేకరించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఈ నెల 23న తెలంగాణ కొత్త ఏఐసీసీ ఇంఛార్జ్ సందీప్తో సమావేశం కావాలని ఏఐసీసీ కార్యదర్శి సూచించారు. గతంలోనూ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో చేసిన వ్యాఖ్యల సమయం లోనూ టీపీసీసీ పిలిచి మాట్లాడింది.
తరువాత కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ తోనూ రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికీ రేవంత్ పైన విమర్శలు చేస్తూనే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయటం తమ లక్ష్యామని చెబుతూ వస్తున్నారు. సీఎం రేవంత్ సైతం సిద్దిపేట సభలో చేసిన వ్యాఖ్యల పైన రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీ హైకమాండ్ వద్దకు చేరటంతో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు.. నిర్ణయాల పైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.














Click it and Unblock the Notifications
